ఇంద్రవెల్లి: గత నెల రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో సంచరిస్తున్న అటవీ జంతువును ఎట్టకేలకు రాంనగర్ కాలనీవాసులు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పట్టుకున్నారు. సిసి ఫుటేజ్ లో గమనించిన పలువురు ఇది మర్నాగి అని మరికొందరు అడవి ముంగిస అని ఇతర జంతువుల పేర్లు చెబుతూ భయాందోళనకు గురయ్యారు. ఆదివారం రోజున రాత్రి 9 గంటల ప్రాంతంలో రాంనగర్ కాలనీలో ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు కనిపించింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయగా.. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బందితో కలిసి వలవేసి ఉంచారు.
స్థానికులు అర్ధరాత్రి పూట ఇంటి పైన చప్పుడు రావడంతో అందరూ హుటాహుటిన లేచి పరిశీలించగా.. వలలో ఈ అటవీ జంతువు చిక్కుకొని ఉన్నది. స్థానిక యువకులు ఆ జంతువును చాకచక్యంగా పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం. చంద్రారెడ్డి, అటవీశాఖ సిబ్బంది సంజివ్ కలిసి వాహనంలో చీచ్ ధరి ఖానాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళారు. అక్కడ వలనుండి ఆ జంతువును తీసీ స్వేచ్ఛగా బయటకు వదిలేశారు. అది స్వేచ్ఛగా పరుగులు తీస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ జంతువును అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీన్ని పునుగు పిల్లి అంటారని తెలిపారు. పునుగు పిల్లిని చూసి చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారని, ఎట్టకేలకు రాంనగర్ కాలనీ యువకులు ధైర్యం చేసి వలలో చిక్కడం వల్ల చాకచక్యంగా పట్టుకొని తమకు అప్పగించగా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో దాన్ని వదిలి వేసినట్లు తెలిపారు.
యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి అటవి జంతువు "పునుగు పిల్లి"కి ఎలాంటి హాని కాకుండా అటవీశాఖకు అప్పగించి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు వారు కూడా అక్కడికి వచ్చి సహకరించి అటవీ ప్రాంతంలో పునుగుపిల్లిని వదిలేయడం జరిగిందన్నారు. అటవి శాఖ సిబ్బందికి సహకరించి వన్య ప్రాణుల సంరక్షణకు తోడ్పడిన యువకులను అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. అటవీజంతులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ఏదైనా సమాచారం ఉన్న ఏదైనా జంతువు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ధైర్యం చేసి పునుగు పిల్లిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అడవిలో వదిలి వచ్చినందుకు స్థానిక రామ్ నగర్ కాలనీవాసులు సైతం ఆ యువకులను అభినందించారు.