బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈటల చేసిన ఆరోపణల్లో నిజం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి శనివారం సాయంత్రం వెళ్లిన రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేశారు. కానీ రేవంత్ సవాల్ ను స్వీకరించి ఈటల ప్రమాణం చేయడానికి ఆలయానికి రాలేదు. దాంతో రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్లెక్సీని దహనం చేసి నిరసనకు దిగారు.


యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశానుసారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజంగా మీరు రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిజం అని భావిస్తే తడి బట్టలతో రా అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం, అని రేవంత్ రెడ్డి అన్నా కూడా.. కాని పోని ఆరోపణలు చేస్తూ బట్టకాల్చి మీద వేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్ డిమాండ్ చేశారు. 


ఈటల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతికి వత్తాసు పలుకుతూ, ఇప్పుడు కాంగ్రెస్ నేతలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో యువజన కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటారని ఈటలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబిసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంబకంటి అశోక్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాహిద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసంకిస్తూ, తుడం వినోద్, తాహెర్ ఖాన్, ఫయిమ్, మొసిన్ ఖాన్, తదితరులు ఉన్నారు.


మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రుజువు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌పై చేశారు. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణానికి రావాలని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. రేవంత్ సవాల్ పై ఈటల రాజేందర్  స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదన్నారు. తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందన్న ఆయన అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదన్నారు. తాను దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని చెప్పుకొచ్చారు. దీనిపై సరైన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు.