Adilabad News: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని సెయింట్ పాల్ స్కూల్‌లో హనుమాన్ దీక్షాపరులు ఆందోళన చేపట్టారు. 6వ తరగతి చదువుతున్న బానోత్ అభినవ్ అనే విద్యార్థి హనుమాన్ దీక్ష చేపట్టి దీక్ష దుస్తులతో స్కూల్ కు వెళ్లాడు. దీంతో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపాల్ దీనా.. దీక్షా దుస్తులతో పాఠశాలకు రాకుడదని.. స్కూల్ యూనిఫాం వేసుకొని రావాలంటు విద్యార్థిపై ఫైర్ అయ్యారు. ఇది గత రెండు రోజుల క్రితం జరిగిన విషయం. అయితే తనతోపాటు దీక్ష వేసుకున్న మరికొందరికి ఈ విషయం తెలియడంతో హనుమాన్ దీక్ష పరులు విద్యార్థికి మద్దతుగా సెయింట్ పాల్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారించడం సరికాదని ప్రిన్సిపాల్ దీనాను హనుమాన్ దీక్షపరులు నిలదీశారు. దీంతో గంటసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే చివరికి ప్రిన్సిపాల్ దీనా తన తప్పును ఒప్పుకొని ఇంకోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకంటానని క్షమాపణ చెప్పడంతో అందరు ఆందోళన విరమించారు.
గతేడాది డిసెంబర్ లో ఏపీలోనూ ఇలాంటి ఘటనే..
శ్రీకాకుళం జిల్లాలోని ఓ క్రిస్టియన్ విద్యా సంస్థ.. ఆ బడిలో చదివే విద్యార్థులు అయ్యప్ప దీక్షా దుస్తులు ధరిస్తే పాఠశాలకు రానివ్వడం లేదు. కేవలం పాఠశాలకు చెందిన యూనిఫాం మాత్రమే వేస్కోవాలని అలా కుదరని పక్షంలో బడికి రావొద్దని తెలిపింది. అయితే ఆ విద్యా సంస్థ తీరుపై హిందూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హిందూ ధార్మిక సంస్థలు, సంస్థలు కూడా బడి తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోంది. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని.. హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. మాల వేసుకున్నన్ని రోజులు.. పిల్లలు అవే బట్టల్లో వస్తారని, అందుకు విద్యా సంస్థలు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపొద్దని వివరించింది.