Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ సొత్తును కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.55 లక్షల విలువైన 296 కిలోల రాగి తీగలు, ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. 

Continues below advertisement

ఆదివారం విశ్వసనీయ సమాచారం మేరకు మావల పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్, పిట్టలవాడ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతుంది. దీన్ని ఆపి తనిఖీ చేయగా, ఇనుప స్క్రాప్‌తోపాటు 17 సంచుల్లో 296 కిలోల రాగి తీగలు లభ్యమయ్యాయి. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.3.55 లక్షలుగా గుర్తించారు. 

పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే ప్రధాన నిందితుడు షేక్ అయ్యూబ్ అసలు సంగతి చెప్పాడు. చోరీకి గురైన రాగి తీగలను కొనుగోలు చేసి నిజామాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. అతనికి షేక్ అమర్ సహకరిస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే దాస్నాపూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారులు మొహమ్మద్ అబ్దుల్ మతీన్ @ సౌఫిక్, మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, పంజేషా మహల్లాకు చెందిన మొహమ్మద్ జావేద్, మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్ చోరీ సొత్తుగా అనుమానిస్తున్న రాగి తీగలను విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు.

Continues below advertisement

1. షేక్ అయ్యూబ్, నిజామాబాద్2. షేక్ అమర్3. మొహమ్మద్ అబ్దుల్ మతీన్ @ సౌఫిక్, దాస్నాపూర్4. మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, పిట్టలవాడ రోడ్, దాస్నాపూర్5. మొహమ్మద్ జావేద్, పంజేషా మహల్లా6. మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్, పంజేషా మహల్లా

ఈ నిందితుల వద్ద నుంచి ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 17 సంచుల్లో 296 కిలోల రాగి తీగలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.