Bhatti Vikramarka Criticises KCR BRS Government Over Farmer Issues: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గూడెం ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ, కానీ బీఆర్ఎస్ పాలనతో రైతుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాక నాసిరకం పనులు చేయడం వల్లనే మోటర్లు రిపేర్ కు వచ్చి రైతులకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు.


నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన భట్టి విక్రమార్క
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దండేపల్లి రైతులకు, కాంగ్రెస్ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీళ్లను రెండు మోటార్ల ద్వారా పంపింగ్ చేసి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మోటార్ల పంపింగ్ సామర్థ్యం తగ్గట్టుగా పైప్ లైన్ వేయలేదన్నారు. పైప్ లైన్ పనులు నాసిరకంగా ఉండటం వల్ల పగిలిపోతున్నాయి. మోటర్లు కూడా ఖర్చు రిపేర్ కావడంతో కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నీళ్ల కోసం తెలంగాణ పోరాటం, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం
కెనాల్ 30, 42 కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నిరందించాలని భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 13 మంది రైతుల ప్రాణానికి ముప్పు ఉండటంతో వారికి భరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశామని తెలిపారు. నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకుంది. కానీ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం రైతుల గోసపడటం ప్రభుత్వ వైఫల్యం అంటూ మండిపడ్డారు. సాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు. ప్రభుత్వం పై పోరాటం చేద్దాం అన్నారు.


కాంగ్రెస్ పార్టీ రైతులకు వెన్నంటి ఉంటుంది. వారి కష్టాలకు అండగా ఉంటాం అన్నారు భట్టి. 2023- 24 కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అన్నారు. గూడెం ప్రాజెక్టుకు కొత్త మోటర్లు, కొత్త పైప్ లైన్ వేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. యాసంగి సాగుకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడతానని అన్నదాతలకు ఊరట కలిగించారు భట్టి విక్రమార్క.


తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాల అమలు ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి విడిగా పాదయాత్ర ప్రారంభించడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆయన పాదయాత్రకు హాత్ సే హాత్ జోడో యాత్ర అని కాకుండా సేవ్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో వివాదం అయింది. సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డితోపాటు  పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా దాదాపు 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.  బాసర లోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను మొదలు పెట్టారు.  టీపీపీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  కోదాడ నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించి.. హుజూర్ నగర్ నియోజక వర్గంతో పాటు నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర  చేయనున్నారు.