ఆ కుటుంబాన్ని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. తల్లి ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందింది. తండ్రి కిడ్నీ వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. అక్క మానసిక వికలాంగురాలు. ఎనిమిదేళ్ల ఆ చిన్నారికి మాటలు రావు. అయినా ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. అన్నీతానై కుటుంబాన్ని చూసుకుంటోంది. ఉండేందుకు సరైన ఇళ్లు లేదు. ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో ఆ చిన్నారి ఊర్లో ఇంటింటా తిరుగుతూ అన్నం ఆడుక్కుంటు కుటుంబం కడుపునింపుతోంది. ఆదిలాబాద్ జల్లాలోని గుర్రాలతండాలో దీనావస్థలో ఉన్న మలారిసింగ్ కుటుంబంపై ABP దేశం ప్రత్యేక కథనం..


ఆదిలాబాద్ జల్లా బోథ్ మండలంలోని గుర్రాలతండా గ్రామానికి చెందిన మలారిసింగ్, ఊర్మిళ దంపతులకు నలుగురు కూతుర్లు. రెండవ కూతురు సరిత మానసిక వికలాంగురాలు. నాలుగో కూతురు గంగోత్రి మూగ, గంగోత్రి పుట్టి ఏడాది కాకముందే 2015లో అనారోగ్యంతో తల్లి ఊర్మిళ మృతిచెందింది. దీంతో కూతుర్లను తండ్రి మలారిసింగ్ తో పాటు నాన్నమ్మ భాగవతిబాయి చూసుకున్నారు. 2016లో పెద్ద కూతురు కల్పనకు పెళ్లి చేశాడు. 2017లో నాన్నమ్మ భాగవతిబాయి మృతి చెందింది. అప్పటినుంచి తండ్రి మలారిసింగ్ కూలీ పనిచేస్తూ కూతుర్లను పెంచాడు. 2022లో మూడో కూతురు మీనాక్షికి సైతం వివాహం చేశాడు. పెళ్లి చేసిన ఇద్దరు కూతుళ్లు మహరాష్ట్రలో దూరంగా ఉంటున్నారు.


ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మరో ఇద్దరు కూతుర్లను చూసుకుంటున్న తండ్రి మలారిసింగ్ ను విధి వెక్కిరించింది. ఏడాది కిందట కిడ్నీ సంబంధిత వ్యాధి సోకింది. దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఈ ముగ్గురు ఉండే ఇల్లు రేకులతో నిర్మించింది. వేసవిలో ప్రస్తుతం భానుడి భగ భగతో మండుతోంది. ఒక ఫ్యాన్ కూడా లేదు. ఇంట్లో తినడానికి తిండి సరుకులు ఏమికుడా లేవు. వీళ్లకు ఒకట్రెండు జతల దుస్తులు తప్పా వేరే దుస్తులు లేవు. గాలిలో దీపంలా వీరి కుటుంబం పరిస్థితి ఉంది. పూటగడవం కష్టంగా మారడంతో కొద్దిపాటి తెలివితేటలతో మూగ అమ్మాయి గంగోత్రి ఊర్లో ఇంటింటా తిరుగుతూ కావాల్సిన భోజనం సమకూరుస్తుంది. 


అక్క సరితకు, తండ్రి మలారిసింగ్ కు తినిపిస్తూ కడుపు నింపుతోంది. అలా తాను తన జీవితం కొనసాగిస్తోంది. మంచానికి పరిమితమైన తండ్రిని ఈ చిన్నారి అన్ని తానై చూసుకుంటోంది. తండ్రికి ఆరుబయట కూడ వెళ్లలేని పరిస్థితి. ఈ కుటుంబ పరిస్థితి చూస్తే ఎవరికైనా కంట నీరు రాకుండా ఉండదు. ఈ కుటుంబ పరిస్థితి తెలుసుకొని abpదేశం గుర్రాలతండాకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకుంది. మలారిసింగ్ తన గోడును ఆవేదనతో ‘abp దేశం’తో పంచుకున్నారు. తనకు తోడు ఎవరు లేరని.. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి ఇలా, తాను మంచంపై ఇలా విగత జివిలా ఉన్నానని, తమకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. 


స్థానికులు సైతం మాట్లాడుతూ.. మలారిసింగ్ కుటుంబం గురించి వివరించారు. చిన్నారి ఇంటింటా అడిగినప్పుడల్లా అన్నం పెడుతున్నామని, ఈ కుటుంబానికి దిక్కెవరు లేరని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరీ దీనావస్తలో ఉన్న ఈ మలారిసింగ్ కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, ఎవరైనా దాతలు స్పందించి ఆర్థిక సహయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని, అలాగే మలారిసింగ్ కిడ్నీ వ్యాధితో బాధపడటంతో ఆయనను డయాలసిస్ సెంటర్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని  కోరుతున్నారు.