భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి వెబ్ సైట్ అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ధరణి వెబ్ సైట్ పై ఆరోపణలు, సవాళ్ల పర్వం కొసాగుతోంది. ఈ క్రమంలో ధరణి వెబ్ సైట్ గురించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జీహెచ్ఎంసీ వార్డు అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్ హౌజ్ కే పరిమితం అవుతారని, ప్రజల్ని కలవడం లేదనే విమర్శలపై కేటీఆర్ స్పందించారు. ప్రజాప్రతినిధులు ఉద్యోగ వ్యవస్థ విఫలమైనప్పుడే ఏ సమస్య అయినా  తన వరకు వస్తుందని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ ప్రస్తావించారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి, అన్ని వర్గాల వారి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.






నగరంలో ఒక్కో డివిజన్‌లో 70 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉండటంతో వారికి సేవలు అందించేందుకే వార్డు అధికారుల వ్యవస్థ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్‌ నాటికి ఎస్​టీపీల ద్వారా జీహెచ్​ఎంసీలోని ప్రతి నాలాలోని మురుగునీటిని శుద్ధి చేస్తామని చెప్పారు. జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం రోజున 150 ప్రాంతాల్లో ఒకేసారి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వార్డు అధికారుల జాబ్‌ చార్ట్‌తో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంత సమయంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్టర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు కార్యాలయ సిస్టమ్ అనేది దేశంలో ఇదే ప్రథమమని కేటీఆర్ చెప్పారు. 


ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు విఫలమైతేనే సమస్య సీఎం దగ్గరికి వెళ్తుందని, కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు కేటీఆర్. ఈ కారణంతోనే సీఎం కేసీఆర్ ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. పరిపాలన సంస్కరణలో భాగంగా జీహెచ్‌ఎంసీలో సేవలందించేదుకు వార్డు అధికారుల్ని ప్రవేశపెట్టామన్నారు. జవహర్‌నగర్‌లో తడి చెత్త ద్వారా రూ.200 కోట్లు ఆర్జించాం. 8 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను లిఫ్ట్‌ చేస్తున్నాం, 2024 చివరికల్లా 101 మెగావాట్ల విద్యుత్‌ను చెత్త ద్వారా ఉత్పత్తి చేస్తామన్నారు కేటీఆర్.


‘"స్వపరిపాలనా" ఫలాలనే కాదు
'సుపరిపాలనా" సౌరభాలను
సమాజంలోని ప్రతి వర్గానికి
సగర్వంగా అందిస్తోంది 
మన తెలంగాణ
ప్రభుత్వం


తొమ్మిదేళ్ల
తెలంగాణ ప్రస్థానంలో
ఎన్నో చారిత్రక నిర్ణయాలు 
మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు


"ప్రజలే కేంద్రం"గా సాగిన 
తెలంగాణ సంస్కరణల పథం
యావత్ భారతావనికే ఓ పరిపాలనా పాఠం 


ప్రతి నిర్ణయం పారదర్శకం
ప్రతి మలుపులో జవాబుదారితనం
ప్రతి అడుగులో  ప్రజల భాగస్వామ్యం 


#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.