ఇచ్చిన హామీలు అడిగితే దాడులు చేస్తారా, దాడులు చేసేందుకే గెలిపించారా ప్రజలు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇస్సాపల్లిలో బీజేపీ నాయకులను ఆయన పరామర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో మాట్లాడిన ఆయన..తప్పు అని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి దాడులు కొత్త కాదన్నారు.
భయపడే పార్టీ కాదు
బీజేపీ భయపడి పారిపోయే పార్టీ కాదు. ముందుకే తప్ప వెనకడుగు వెయ్యం. రాష్ట్రం కోసం మీ కుటుంబం ఏం త్యాగం చేసిందో కేసీఆర్ చెప్పాలి. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి కేసీఆర్. భాజపా ఎదుగుదల జీర్ణించుకోలేక దాడులకు తెగబడడం మూర్ఖత్వం. కుటుంబం కోసమేనా తెలంగాణ సాధించుకున్నది. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవో కోసం భాజపా కొట్లాడింది. భాజపా ప్రశ్నించడం మొదలు పెట్టిందని దాడులకు పాల్పడటం నీచమైన చర్య. మూర్ఖపు కుటుంబ పాలన అంతానికి పోరాటం చేస్తాం. మేము దాడులు చేయడం మొదలు పెడితే బిస్తర్ కట్టాల్సిందే. దొంగ దీక్షలు చేసిన కేసీఆర్.. భాజపా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే రాష్ట్రం వచ్చేదా.. కనీసం ఓటింగ్ లో కూడా కేసీఆర్ పాల్గొనలేదు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు.. తెరాసకు మద్దతుగా మారితే మంచిది కాదు. అలాంటి వారిపై దాడులపై ప్రివిలేజ్ కమిటీలో తేలుస్తాం. అనేక మంది ఐపీఎస్ లు మధనపడుతున్నారు. భయపడి, లొంగిపోయి పనిచేస్తే సరైంది కాదు' అని బండి సంజయ్ అన్నారు.
సీఎంవో ఆదేశాలతో దాడులు
ఎంపీ అర్వింద్ పై దాడి గురించి సీపీకి ముందే తెలుసని బండి సంజయ్ ఆరోపించారు. కానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారన్నారు. సీఎంవో కార్యాలయ ఆదేశాలకు అనుగుణంగానే దాడులు జరిగాయన్నారు. దాడి చేసే వారిని నియంత్రించకుండా ఎంపీని నిలువరించాలని సీపీ చూశారని ఆరోపించారు. ఎంపీపై దాడి చేస్తే ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యలేదని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హత్యాయత్నం చేసిన అందరూ బయట తిరుగుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తిరిగి తమపైనే కేసులు పెడతారని, కరీంనగర్ లో ఇదే జరిగిందన్నారు. ఇంతటి నిర్బంధం, అరాచకం చూడలేదన్నారు. గవర్నర్ ను కూడా గౌరవించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే ఎంపీ అర్వింద్ పై దాడి చేశారని విమర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు.