Nizamabad News : నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట్ సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధింస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు.  పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేట్  సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి, భర్త తిరుపతి(వార్డ్ మెంబర్) తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. రెండు కోట్ల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటి బిల్లులు ఇవ్వకుండా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బీజేపీ నుంచి ఎన్నికైన తాను అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరామని, అయినా తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 


జీవన్ రెడ్డి వేధింపులు?


ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  తనను వేధిస్తూ.... ఇబ్బంది పాలు చేస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత డబ్బు వెచ్చిoచామని తమ పరిస్థితి ధీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్ల రూపాయలు మిత్తితో కలిపి మూడు కోట్ల వరకు చేరిందని అన్నారు. చేతిలో డబ్బులు లేక, పెండింగ్ బిల్లులు రాక దీనస్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. 


అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు


 బీసీ కులానికి చెందిన సర్పంచ్ అవడంతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఉపసర్పంచ్ మాద రవి అభివృద్ధి పనుల బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. సుమారు రెండు కోట్ల రూపాయలు నందిపేట్ గ్రామ అభివృద్ధికి వెచ్చించానని తెలిపారు. బిల్లులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా సహకరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి ఆవేదనం చెందారు. వడ్డీలు కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించమని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు.  సర్పంచ్ భర్త తనతో తెచ్చుకున్న పెట్రోలును తన భార్యతో పాటు తనపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి సర్పంచ్ దంపతులను అడ్డుకుని వారిని అక్కడ నుంచి పంపించేశారు.   


సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం బాధాకరం 


"నిజామాబాద్ కలెక్టరేట్ లో బిల్లులు రాలేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరం. కేసీఆర్ సర్పంచులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నరడానికి ఇదే నిదర్శనం. చేసిన పనులకు బిల్లులివ్వరు. కేంద్రం ఇచ్చిన నిధులకు సర్పంచులకు తెలియకుండా తస్కరిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన ఎంపీ అరవింద్ ను దూషిస్తున్నారు. కేసీఆర్  దృష్టిలో నోరు మూసుకుని కూర్చునే వాళ్లు మంచోళ్లు, ప్రశ్నించే వాళ్లు దుష్టులు" - బండి సంజయ్