MP Dharmapuri Arvind : నిజామాబాద్ సీపీ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఎంపీ అర్వింద్ బైఠాయించారు. బాల్కొండ నియోజకవర్గం కుకునూరు గ్రామం వెళ్తోన్న అర్వింద్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడి నుంచి వెనుదిరిగిన ఎంపీ అర్వింద్ సీపీ నాగరాజును కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీపీ అక్కడ లేకపోవటంతో ఆయన కార్యాలయం ఎదుట బైఠాయించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగేందుకు ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఎంపీ అర్వింద్. ఎంపీని కుకునూరు వెళ్లనివ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించారు. 


"నన్ను సీపీ ఎందుకు వెళ్లొద్దని అంటున్నారు. 2 గంటలుగా టీఆర్ఎస్ నాయకులు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారిని సీపీ ఎందుకు క్లియర్ చేయటం లేదు. కుకునూరు నా దత్తత గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకోవటం ఏంటి. టీఆర్ఎస్ నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇందురు నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదు. సీపీ నాగరాజు గతంలో మాపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను రైతులు అన్నారు. దానిపై ఆయనకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రేపో, మాపో ఆయన కమిటీ ముందు సంజాయిషీ ఇచ్చుకోవాలి" అని ఎంపీ అర్వింద్. 


కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు యత్నం


సీపీ వచ్చి తనకు భద్రత కల్పించే వరకు తాను అక్కడి నుంచి కదలనని ఎంపీ అర్వింద్ అంటున్నారు. సీపీ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పారని టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలు పట్టుకుని తనపై దాడులు చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. ఏసీపీ ఫోన్ చేస్తే వాళ్లను క్లియర్ చేస్తున్నామన్నారు. సీపీ నాగారాజు మాత్రం వాళ్లంతా రైతులు అంటున్నారు. వాళ్లు నిరసన తెలపడానికి వచ్చారే కానీ దాడి చేయరని సీపీ చెప్పారని ఎంపీ అంటున్నారు. తనకు భద్రత ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. 


"నా నియోజకవర్గంలో తిరిగేందుకు నాకు భద్రత ఇవ్వాలి. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తానన్న సీపీ నాగరాజు ఇవాళ రావాలి. నా భద్రతపై సమాధానం చెప్పాలి" అని ఎంపీ అర్వింద్ అన్నారు. 


Also Read : Minister KTR : గాంధీ భవన్ లో గాడ్సే, కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు : మంత్రి కేటీఆర్