Minister Vemula Prashanth Reddy : బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల క్లస్టర్ 2 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనoలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జిల్లా ఇన్ ఛార్జ్ మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరు ఆత్మీయ సమ్మేళనానికి రావడంపై మంత్రి వేముల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో కలియ తిరుగుతూ..సమ్మేళనానికి వచ్చిన వారి మంచి చెడులు అడుగుతూ ఆత్మీయంగా పలకరించారు.  మంత్రితో పలువురు కుటుంబ సభ్యులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మంత్రి ఓపిగ్గా కార్యకర్తల కుటుంబాలతో ఫొటోలు దిగి వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. మంత్రి వేముల కలుపుగోలుతనంతో సమ్మేళన ప్రాంగణమంతా కోలాహలంగా కన్పించింది. పలువురు బీఆర్ఎస్ నేతులు బాల్కొండ నియోజకవర్గంలో, కమ్మర్ పల్లి మండలం ప్రాంతంలోని గ్రామాల్లో, తండాల్లో చేసిన అభివృద్ధిని ఈ సమ్మేళనం వేదికగా వివరించారు.  


దమ్ముంటే అదానీ ఉదంతంపై దర్యాప్తు చేయాలి 


అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... నరేంద్ర మోదీ పాలనలో రూపాయి విలువ పతనమైందని ఆరోపించారు. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200 పెరిగిందన్నారు. పప్పు, అప్పుల ధరలు పెరిగిపోయాయన్నారు. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 అయ్యిందన్నారు. దీంతో ట్రాన్స్ పోర్ట్ ధర పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోందన్నారు. సామాన్యుల మీద ధరలు పెరగడం పెను భారంగా మారిందన్నారు. దీనంతటికి కారణం ప్రధాని మోదీ అని ఆరోపించారు. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.... నరేంద్ర మోదీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు. బడా బాబుల కంపెనీలకు రుణమాఫీ చేసి పేదల డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఎద్దేవా చేశారు. అలా తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారని ఆరోపించారు. వాళ్ల అవినీతి గురించి మాట్లాడితే.... కేసులు పెడుతున్నారనీ మండిపడ్డారు. ప్రధాని మోదీ దమ్ముంటే అదానీ ఉదంతంపై సీబీఐ,ఈడీ విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు. అవినీతి గురించి మోదీ మాట్లాడడం పెద్ద జోక్ అన్నారు. 


తెలంగాణ మోడల్ పాలన 


తెలంగాణ మోడల్ పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్ వస్తోందనీ, కేసీఆర్ పరిపాలన కావాలని, ఆయన నాయకత్వం వహించాలని యావత్ దేశం ఆహ్వానిస్తోందని మంత్రి వేముల తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల్లో ఆలోచన జరిగి మొత్తం ఏకమయ్యారని అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కనిపించిన అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్,బీజేపీ లకు కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రజాఆమోదంతోనే రాజకీయాల్లో ఉన్నారని మంత్రి వేముల మరోమారు స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల ఆశీర్వాదంతో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అమెరికాలో తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని వచ్చారని ప్రజల్లో ఉన్నారని తెలిపారు. ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ప్రతి ఎన్నికకు ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తోందనీ అన్నారు. 


కార్యకర్తలే మా బలం, బలగం 


కవిత ఒకసారి ఎంపీగా..ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ప్రజల ఆమోదంతోనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని మంత్రి వేముల స్పష్టం చేశారు. మీరంతా నా కుటుంబ సభ్యులే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని మంత్రి భావోద్వేగంగా మాట్లాడారు. బాల్కొండలో 60 ఏళ్లలో లేని అభివృద్ధి కేసీఆర్ వల్ల 8 ఏళ్లలో చేసి చూపించానన్నారు. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో ఇవాళ నేను ఇలా ఉన్నానన్నారు. కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన దయతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని తెలిపారు.