కామ్రెడ్స్ కదంతొక్కడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎరుపెక్కింది. CPM, CPI ముఖ్య నాయకుల ఉమ్మడి సమావేశంలో ఒకే ఎజెండాపై నేతలంతా పిలుపునిచ్చారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉమ్మడి పార్టీలు కలిసి పనిచేయాని తీర్మానించారు. ఈ సభకు CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, CPI జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, CPI జాతీయ కార్యదర్శి నారాయణ, CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, CPI రాష్ట్ర కార్యదర్శి కునమనేని సాంబశివరావు. బీవీ రాఘవులు, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు


రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని గద్దె దించాలి- సీతారాం ఏచూరి


కలిసి పనిచేయడానికి CPI, CPM కలిసి రావడం శుభపరిణామమన్నారు CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ED, CBI ద్వారా బీజేపీయేతర ప్రభుత్వాలు లేకుండా చేయాలనేదే మోదీ సిద్దాంతమని అన్నారు. 5వేల మందికి పైగా ఈడీ చార్జ్‌షీట్ ఇచ్చిందికానీ 0.1 పర్సెంట్ మాత్రమే నేరం నిరూపితమైందన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. రైతంగం మరోసారి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మతోన్మాద ఘర్షణలు అరికట్టాలి. దేశచరిత్రలో రామనవమి, హనుమాన్ జయంతి వేడుకల్లో ఏనాడూ ఘర్షణలు జరగలేవు. ఈమధ్య కాలంలో ఘర్షణలు దారి తీస్తున్నాయి. కర్ణాటకలో హిందూత్వ ఓటు బ్యాంకు కోసం టిప్పు సుల్తాన్ అంశాన్ని తెచ్చి ఘర్షణలు క్రియేట్ చేస్తున్నారు.  తెలంగాణ సాయుధ పోరాటాలకు వారసులం మనం. తెలంగాణ అభివృద్ధికి  కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోంది. మోదీ ప్రభుత్వంపై  ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. మతోన్మాద ఘర్షణలు పెంచేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నం చేస్తున్నది- సీతారాం ఏచూరి  


బీజేపీ 50 సీట్లు ఇచ్చినా కాలి గోటితో సమానం- తమ్మినేని  


ప్రపంచం మొత్తం ఎర్రజెండా వైపు చూస్తున్న క్రమంలో వామపక్షాలు కలిసిపోరాడాలని నిర్ణయించుకున్నాయని తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు లేకుండా పోతున్నాయి భవిష్యత్ ఉందా అని ఆలోచిస్తున్నారు. కమ్యూనిస్టులకు భవిష్యత్ ఉందా అనేది కాదు.. కమ్యూనిస్టులు లేకపోతే మీకు భవిష్యత్ ఉందా అనేది ఆలోచించండి. ఒకేదేశం ఒకే టాక్స్ అని చెప్పే మోదీ ఒకే కులం అని ఎందుకు చెప్పడం లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ మళ్ళీ రావాలని కోరుకునే వారు బీజేపీ, RSS వాళ్లు. RSS మూలపురుషులు రాసిన గ్రంధాల్లో ఈ దేశం వర్ణ, కుల సంక్రమణం జరిగింది. ఏ కులం వారు ఆ కుల వృత్తి చేసుకోవాలి అని చెప్పడమే బీజేపీ సిద్దాంతం. బీసీ ప్రధాని అంటున్నారు కానీ బీసీ లకు ఏం చేస్తున్నారు. దేశంలో అన్ని పార్టీలు కులగణన జరగాలి అని చెబుతున్న బీజేపీ ఎందుకు చేయడం లేదు. రాష్ట్రాల హక్కుల కోసం. బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకిస్తునే ఉంటాం. బీజేపీ తెలంగాణలో 50 సీట్లు ఇస్తాం అంటే వెళ్తమా? కాలిగోటితో సమానం మీ సీట్లు. ఈ గడ్డ మీద కాషాయ  జెండా ఎగరడం కాదు.. తరిమి తరిమి  కొడతాం. గోల్కొండ కోట కింద బొంద పెడతాం- తమ్మినేని వీరభద్రం


వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలి- డి.రాజా


 CPI, CPM కలయిక నాంది ప్రస్తావన అన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా. గత సంవత్సరం విజయవాడ లో ఉద్యమ పునరేకీకరణ జరగాలని మహాసభలో ప్రతిపాదించింది నేడు జరిగిందన్నారు. RSS, బీజేపీ సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలి అనేది కమ్యూనిస్టుల ముందు ఉన్న పెద్ద సవాలన్నారు రాజా. కమ్యునిజం అనేది అత్యంత ప్రమాదకరమైనది అని మోడీ చెబుతున్నారు. మేము చెబుతున్నాం కమ్యునిజం మోదీ, బీజేపీలకు ప్రమాదకరం. మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలని కుట్ర జరుగుతుంది. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పని చేస్తే అందుకు బీజేపీ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నది. అందుకు మనం ఊరుకుంటామా? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే అదానీ, మోదీ సంబంధం బయటికి వస్తుంది కనుక వేయడం లేదు. రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేరుగా ఉంటాయి. కానీ తెలంగాణ, తమిళనాడు, కేరళలో గవర్నర్‌ను ఒక సాధన గా ఉపయోగిస్తున్నారు. ఒకే భాష, ఒకే దేశం ఒకే పార్టీగా మారాలని మోదీ చూస్తున్నారు. ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలి. అన్ని సెక్యులర్, ప్రోగ్రెసివ్ పార్టీలు ఒక్క తాటి మీదకు రావాలి.  బీజేపీ ని ఓడించాలి. -డి.రాజా


రైల్వే స్టేషన్లను ముస్తాబు చేసేది అమ్మడానికే- రాఘవులు


ఉత్తరాదిలో బీజేపీ బలం కోల్పోతోంది. అందుకే దక్షిణాదిన బలపడేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు. దేశంలో 40 రైల్వే స్టేషన్లను రానున్న రోజుల్లో అమ్మడానికే ముస్తాబు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎయిర్ పోర్టులన్నీ మోదీ ప్రవైట్ శక్తులకు అప్పజెప్పాడు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. భాగ్యలక్ష్మి దేవాలయనగరం నుంచి వెంకటేశ్వరుడి వరకు వందే భారత్ ట్రైన్ వెళ్తుందని మోదీ చెబుతున్నారు. అంటే, నేను నాస్తికుడిని, నేను వందే భారత్ రైల్ ఎక్కే అవకాశం లేదా‌? ముస్లిం క్రైస్తవులు వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం చేయకూడదా..? శాసనసభలో కమ్యూనిస్టులకు స్థానం ఉండాలి. వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్ట సభల్లో బలం పెంచుకోవాలి. తెలంగాణ పోరాటంలో వేలమంది కమ్యూనిస్టులు త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు పోవాలి. – రాఘవులు


కామ్రెడ్లు కొట్టుకోవడం మానేసి కలిపిపోరాడితే మంచిది- నారాయణ


గుజరాత్ ముద్ర ఓడరేవు పైన దాడి చేసే దైర్యం మోదీకి ఉందా అని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  డ్రగ్స్ అంతా గుజరాత్ ఓడరేవు నుంచే వస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు గుజరాత్ ఓడరేవుపై దాడి చేస్తే కొన్ని వేల కోట్ల డ్రగ్స్ బయటపడతాయన్నారు. సావర్కర్, గాడ్సే నుంచి మోదీ వచ్చారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిల కమిషన్, న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలను మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ హాయంలో లక్షల కోట్లు బ్లాక్ మనీ వైట్ అయ్యింది. ప్రధాని నుంచే రాజ్యాంగానికి ప్రమాదం. దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్  ఏర్పాటు అవసరం. కమ్యూనిస్టు పార్టీల్లో పోరాటాల కంటే గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పద్ధతి పోవాల్సిన అవసరం ఉంది. – సీపీఐ నారాయణ