Dharmapuri Sanjay On DS : సీనియర్ నేత, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆయన పెద్ద కుమారుడు కాంగ్రెస్ నేత సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ పై కుట్ర జరుగుతోందని, ఆయనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. డీఎస్ చుట్టూ ఉన్నవాళ్లపై అనుమానం ఉందన్నారు. డీఎస్ ను గదిలో బంధించి బలవంతంగా లేఖపై సంతకం చేయించారన్నారు. ఆస్తులు కూడా అలాగే రాయించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తన సోదరుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ హస్తం ఉందన్నారు. అర్వింద్ అంతు చూస్తానని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఆస్తులు కూడా... బెదిరించి రాయించుకున్నారన్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్ అన్నారు. డీఎస్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయించడంలేదన్నారు. 


ఎంపీ అర్వింద్ హస్తం 


"మొన్నటి వరకూ నేను గొప్పొడిని అని చెప్పిన నువ్వు(అర్వింద్) ఎందుకు భయపడుతున్నావు. నన్ను చూసి ఓట్లు వేశారని చెప్పుకున్నావ్ కదా. కన్న తండ్రితో ఇలాంటి ఆటలు ఆడుతున్నాడు. నిజామాబాద్ ప్రజలు అతడ్ని ఇంకెప్పుడూ నమ్మరు. మా అమ్మ అర్వింద్ ఎట్లా చెబితా అలా చేస్తుంది. ఆమెకు పాలిటిక్స్ తెలియదు. బీజేపీ ఎంపీ ఏ లెవల్ కు దిగజారి, ఎలా చేయిస్తున్నారనేది అందరికీ తెలిసింది. డీఎస్ కు ప్రాణహాని ఉందని నాకు డౌట్. ఆయన వందల మందికి చెప్పారు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు. కానీ ఇంతలో ఆయనను బెదిరించి రాజీనామా చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదు" - సంజయ్, డీఎస్ కుమారుడు  


రాజీనామా చేసే వరకు ఇబ్బంది పెట్టారు- డీఎస్ 


ఎంపీ అర్వింద్‌ తండ్రిని బ్లాక్‌ మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారని సంజయ్ ఆరోపించారు. తన తండ్రిలో సంజయ్ ఫోన్ లో మాట్లాడారు.  ఈ సందర్భంగా తనకు ప్రస్తుతం ఎలాంటి  ఇబ్బంది లేదన్నారు. కానీ రాజీనామా చేసేవరకు తనను హెరాస్‌ చేసినట్లు ఫోన్ కాల్‌లో డీఎస్ చెప్పారు. దీంతో డీఎస్‌కు ధైర్యం చెప్పారు ఆయన కుమారుడు సంజయ్. కొన్ని వందల కుటుంబాలు మనకు అండగా ఉన్నాయని డీఎస్‌తో అన్నారు. మీరో లెజెండ్, ధైర్యంగా ఉండండి డాడీ అని సజంయ్ అన్నారు.  ఒక్క ఫోన్ కాల్ చేస్తే వేల మంది మన ఇంటికి వస్తారన్నారు. నువ్వు సంపాదించిన పెద్ద సైన్యం నీతో ఉందని డీఎస్ కు ధైర్యం చెప్పారు. ఒక్క సెకను కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ డీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడారు డి. సంజయ్. చివర్లో నువ్వు నవ్వితే ఫోన్ కట్ చేస్తానని సంజయ్ చెప్పారు దీంతో డీఎస్ పెద్దగా నవ్వారు.  


అంతకు ముందుకు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరారని, ఆ సందర్భంగా తాను గాంధీ భవన్ కు వచ్చాయని డీఎస్ ఓ లేఖ రిలీజ్ చేశారు. తాను కాంగ్రెస్ లో చేరినట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ లేఖ పంపారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది.