Nirmal News :  నిర్మల్ జిల్లాలో  నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రాజకీయ వివాదానికి దారి తీస్తోంది.  ఇటీవల నిర్మల్ పట్టణంలో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్‌లో భారీ అవినీతి జరిగిందని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఉద్యమాలు ప్రారంభించారు  గ్రీన్ జోన్ లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్ లోకి మార్చి రైతులను మోసం చేస్తున్నారని  విపక్ష నేతలు అంటున్నారు.  అలాగే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న సోఫినగర్ ప్రాంతాన్ని కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చారని..   అక్కడ అధికార పార్టీ నేతలు ముందు కొన్న భూముల విలువలు అమాంతం పెంచుకొని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.                         


 మాస్టర్ ప్లాన్ తో  నిర్మల్ పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని ..తమ ఆస్తుల విలువను బీఆర్ఎస్ నేతలు పెంచుకుంటున్నారని విపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.  ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి మాస్టర్ ప్లాన్ లో ఆ భూములను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చి భారీ స్కాంకు తెరలేపారంటున్నారు.   ఇండస్ట్రియల్ జోన్ ను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలంటే వాటికి కొన్ని పరిమితులు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలే భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తున్నారు.                       


కొద్ది రోజులుగా నిర్మల్ ఆర్డీవో ఆఫీస్ ఎదుటగా ధర్నాలు జరుగుతున్నాయి.  బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.  
  గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌కు   పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించిన మంత్రి తిరిగి అదే తరహా లో కొత్త మాస్టర్ ప్లాన్​ను రూపొందించడం సరికాదని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు.  గ్రీన్ జోన్‌లో    చెరువులు, పంట పొలాలు, చెట్లు ఉన్నప్ప టీకీ వాటిని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి తేవడం తో రైతులకు నష్టం జరుగుతోందని అంటున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని అంటున్నారు.                         


దాదాపుగా ప్రతీ రోజూ నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై అధికారులు..  ప్రజల అనుమానాలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వలేకపోతూండటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో రోడ్డెక్కేవారు పెరిగిపోతున్నారు. గతంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం తీవ్ర దుమారం రేపడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనం అయింది. నిర్మల్ కూడా అదే తరహాలో ఉండటంతో.. సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.