Nirmal Rains : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ ను సందర్శించి ఇన్ ప్లో, అవుట్ ప్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 695 అడుగులు చేరింది. జలాశయంలోకి చేరుతున్న 2,22,412 క్యూసెక్కుల నీరు చేరగా, 16 గేట్ల ద్వారా 2,25,796 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు.
నిండుకుండల్లా జలాశయాలు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీలోకి 81 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, లక్ష క్యూసెక్కుల అవుట్ ప్లో, కడెం ప్రాజెక్ట్ లోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2 లక్షల క్యూసెక్కుల అవుట్ ప్లో, స్వర్ణ ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 27 వేల క్యూసెక్కుల అవుట్ ప్లో, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి 32 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 20300 క్యూసెక్కుల అవుట్ ప్లో వరద ఉందన్నారు.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
వర్షాల వల్ల చెరువులు ఇప్పటికే 70 శాతానికి పైగా నిండాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్పీతో పాటు కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్ట్ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాజెక్ట్ ల పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరదల కారణంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టడం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూశామన్నారు. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులందరూ స్థానికంగా గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట కలెక్టర్ ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నీటిపారుద శాఖ ఈఈ రామారావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.