BRS News :  బీఆర్ఎస్ కీలక నేత కూచాడి శ్రీహరి రావు రాజీనామా చేశారు.  బిఆర్ఎస్ పార్టి పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరి రావ్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తన అనుచరుల సమక్షంలో అధికారికంగా బిఆర్ఎస్ పార్టికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో తన ముఖ్య అనుచరులతో శ్రీహరి రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానుల సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టించుకోవడం లేదంటున్న శ్రీహరి రావు 


కొన్ని రోజులుగా వేరే పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనను, తన అనుచరులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తన సొంత మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తనకు, తన అనుచరులకు ఆహ్వానం పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, ఆమె నాయకత్వంలోనే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. 


సుప్రీంలో అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ- స్వయంగా వాదనలు వినిపించిన సునీత


ఉద్యమకారునిగా పేరున్న శ్రీహరి రావు                         


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో శ్రీహరి రావు క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. దీంతో ఆయనకు బిఆర్ఎస్ పశ్చిమ  జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పగా వాటిని సైతం ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేయడం పట్ల నియోజకవర్గంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని భవిస్తున్నారు.  గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో తమకు సరైన స్థానం దక్కడం లేదని అధిష్టానంపై కోపంగా ఉన్న ఆయన ఈనెల 4న నిర్మల్ లో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు సైతం గైర్హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజినామా చేస్తున్నట్లు లేఖ పంపారు.  త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకొని నిర్మల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.  


కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం                               


ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లాంటి వాళ్లు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరికొందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూండటం  ఆసక్తికరంగా మారింది.