Basara IIIT : నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు మెస్ లలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఆహారంగా ఎగ్ కర్రీ రైస్ ను అందించారు. అయితే ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు గంటన్నర తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. 600 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారంతా హాస్టల్ గదుల నుంచి చికిత్సల కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి వచ్చారు.
పలువురికి తీవ్ర అస్వస్థత
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత చెందిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రథమ చికిత్సలు నిర్వహించారు. తీవ్ర అస్వస్థతో ఉన్న పలువురు విద్యార్థులను రెండు అంబులెన్సులలో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడం, అస్వస్థత చెందిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సత్వర వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భైంసా, ముధోల్ ఆసుపత్రుల నుంచి వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని బాసర ట్రిపుల్ఐటీకి తరలిస్తున్నారు.
ఈ-1, ఈ-2 మెస్ ల్లో
బాసర ట్రిపుల్ ఐటీలో ఈ -1, ఈ -2 మెస్ లో మధ్యాహ్నo భోజనం చేసిన సుమారు 600 మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆర్జీయూకేటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాసర ట్రిబుల్ ఐటీ అంబులెన్స్ లో కొందరిని ఆసుపత్రికి తరలించారు. ఏబీపీ దేశం రిపోర్టర్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ను ఈ ఘటనపై వివరణ కోసం సంప్రదించగా ఆయన స్పందించలేదని తెలుస్తోంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కలెక్టర్, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాలన్నారు. ఫుడ్ పాయిజన్ కు కారణాలు గుర్తించి రిపీట్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Bhadrachalam Danger Zone : భద్రాచలం వద్ద 75 అడుగులకు చేరనున్న గోదావరి - ఇదే జరిగితే ఏమవుతుందంటే ?