Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నిక అనంతరం బీజేపీకి వచ్చిన ఓట్లను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే సంకేతాలతోనే బండి సంజయ్ పాదయాత్ర, భైంసా బహిరంగ సభ రద్దుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తుంటే నిజాం పాలన గుర్తుకు వస్తోందన్నారు. కానీ తమ వైపున ధర్మం ఉండడంతోనే హైకోర్టు ప్రజా సంగ్రామ యాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే మే నెలలోనే కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి 10 స్థానాలను బీజేపీ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.  


కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు 


 మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్‌ లో మాట్లాడిన ఆయన కర్ణాటక తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సిద్ధంగా ఉండాలన్నారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో సీఎం  కేసీఆర్‌ లో భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకులు లేరన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  


ఆరు నెలల ముందే ఎన్నికలు 


తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో స్పష్టంచేశారు. కానీ ముందస్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ అంశంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు.  కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.  ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్, మే నెలలో కర్ణాటకతో పాటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించారు. 
 


కేసీఆర్ మాటలు అర్థాలే వేరు! 


గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవల కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలోనే ఈ విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ మాటలకు అర్థాలు వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా మందస్తు ఎన్నికలు వెళ్లడమే కేసీఆర్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం జరుగుతుంది.