తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ( TRS ) మధ్య ఈ సారి గిరిజన రిజర్వేషన్ల దగ్గర రాజకీయ పంచాయతీ ప్రారంభమయింది. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్.. పార్లమెంట్‌లో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలంటూ తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. దీంతో తెలంగాణలో కలకలం ప్రారంభమయింది. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలే పంపలేదంటూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ ( BJP ) అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ మండిపడింది.
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై 2017లోనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.దీనిపై కేంద్రంతో ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని.. ఇప్పుడు అసలు ప్రతిపాదనే లేదంటూ పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి అబద్దాలు చెప్పారంటూ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. అయితే దాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. 9.08 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచాలని స్పష్టంగా రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖకు బిల్లు పంపామని, దీనిపై ఎక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.2018, 2019లో ప్రధాని మోదీని ( PM MODI ) సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి లేఖ ఇచ్చారని చెబుతున్నారు.
కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నిరసనలు కూడా ప్రారంభించింది. బీజేపీ ఆఫీసును టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీల పరిధిలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళనలు, గిరిజన తండాలు, గూడేల్లో నిరసనలు, రాస్తారోకోలు, శవయాత్రలు చేపట్టాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ ప్రశ్న అడిగింది కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డే ( UTTAM ) . తాము గిరిజనుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
మరో వైపు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ( Etala Rajendar ) టీఆర్ఎస్ వాదనకు మద్దతుగా నిలిచారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది వాస్తవమేనని, కానీ పంపినదాంట్లో కేంద్రం వేసిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందా లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలన్నారు. ఇవన్నీ ప్రజల కళ్లల్లో మట్టి కొట్టేందుకేనని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గొర్రెలు అనుకుంటుందని.. ఏది చెప్పినా నమ్ముతారు అనుకొని ఇతరుల మీద నెట్టేందుకే ఈ గిరిజనుల రిజర్వేషన్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చారని ఈటల మండిపడ్డారు.