హైదరాబాద్: తెలంగాణలో ప్రజలు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చని, ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన వారిని కఠింగా శిక్షించేందుకు కర్ణాటక రాష్ట్రంలో ఇటీవలే తెచ్చిన కొత్త చట్టాన్ని రాష్ట్రంలోను ఈ బడ్జెట్ సమావేశాల్లో తేనున్నట్లు చెప్పారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు, ప్రజా ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
డిసెంబర్ - ఒక అద్భుతాల మాసం
"డిసెంబర్ నెల కేవలం క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక 'మిరాకిల్ మంత్' (అద్భుతాల మాసం)" అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇదే నెలలో జన్మించినట్లు చెప్పారు. వందలాది మంది తెలంగాణ రాదని ఆత్మహత్యలు చేసుకుంటుంటే సోనియాగాందీ భారీ రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారన చెప్పారు. అదే రీతిలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ( కాంగ్రెస్ ) ఏర్పడింది కూడా ఇదే డిసెంబర్ నెలలో కావడం విశేషమని ఆయన గుర్తు చేశారు.
యేసు ప్రభువు బోధనలే మాకు స్ఫూర్తి
మానవ సేవయే మాధవ సేవగా భావించి, ద్వేషించే వారిని సైతం ప్రేమించాలన్న ఏసుక్రీస్తు సందేశం ప్రపంచానికి ఎంతో అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభువు బోధనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల వెల్లువ
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, సొంత ఇల్లు లేని పేదలకు వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తూ పేదల ఇళ్లలో వెలుగులు నింపామని. 3 కోట్ల 10 లక్షల మంది పేదలను మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ చేయడమే కాకుండా, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చాం.
విద్య, వైద్య రంగ అభివృద్ధికి క్రైస్తవ మిషనరీలు యుద్దం మాదిరి కృషి చేశారు.
ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. అదే అంకితభావంతో క్రిస్టియన్ మిషనరీలు పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించాయని సీఎం కొనియాడారు. ప్రభుత్వంతో పోటీ పడి వారు చేస్తున్న సేవలు ఒక యుద్ధంలా, యజ్ఞంలా సాగాయని అభినందించారు. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు ఆమోఘమని సీఎం రేవంత్ ప్రస్తుతించారు.
మత విద్వేషాలపై ఉక్కుపాదం - కొత్త చట్టం
రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటంపై సీఎం కఠిన వ్యాఖ్యలు చేశారు. "ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి. ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే కఠినంగా శిక్షించేలా శాసనసభలో చట్టాన్ని సవరిస్తాం" అని ఆయన ప్రకటించారు. మత ప్రాతిపదికన దాడులకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్టం తెనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో ఇటీవలే కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి చట్టం తెచ్చినట్లు వివరించారు.
మైనారిటీల సంక్షేమం అనేది దయ కాదు - మైనార్టీల హక్కు
మైనారిటీలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎవరి దయ కాదని, అవి వారి హక్కు అని సీఎం స్పష్టం చేశారు. క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 'తెలంగాణ రైసింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ద్వారా అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.