లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఆ విషయంలో మరో షాక్ తగిలింది. బాధితురాలు అయిన శేజల్ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌డబ్ల్యూసీ) కు ఫిర్యాదు చేయడంతో తాజాగా వారు స్పందించారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని జాతీయ మహిళా కమిషన్ అధికారులు తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. మరో 15 రోజుల్లో దీనిపై అప్‌డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా దుర్గం చిన్నయ్యపై శేజల్ లైంగిక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయం కోసం ఆమె జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. ఎప్పటి నుంచో వారికి ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నిన్న ఉదయం 11:30 హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ శేజల్ కు సూచించింది.
అయితే, అరిజిన్ డెయిరీ సీఈవో అయిన శేజల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేసింది. బిజినెస్ మీటింగ్ పేరుతో పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఏర్పాటు చేశారని శేజల్ ఆరోపించింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ రూమ్ నెంబర్ 404లో మందు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారని ఆరోపణలు చేసింది. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారని వారిపైన కూడా సంచలన ఆరోపణలు చేసింది. తన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయని, ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని వాపోయింది.
పనులు చేయించుకోవాలంటే తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఎమ్మె్ల్యే అన్నారని, తాను అందుకు నిరాకరించడంతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎంతపోరాటం చేసిన న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశానని, ఢిల్లీలో కూడా తమకు న్యాయం జరగకుండా ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య అడ్డుకుంటున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేంతవరకు ఢిల్లీని వదిలేదిలేదని ఆమె తేల్చి చెప్పింది. శేజల్ ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద విషం తాగిన సంగతి తెలిసిందే. వెంటనే ఆమెను ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు.