నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన కొందరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ నోటీసులు అందుకున్న వారికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. వెంటనే నోటీసులు అందుకున్న వారిలో కొందరు నేతలు ఢిల్లీ చేరుకున్నారు. నేడు (సెప్టెంబరు 30) ఈ రోజు ఉదయం మరికొందరు నేతలు బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు.
నోటీసులు అందుకున్న వారితో మధ్యాహ్నం ఢిల్లీలో ఆడిటర్లతో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, అదే కేసులో భాగంగా విరాళాలు ఇచ్చిన పలువురి కాంగ్రెస్ నేతలకు తాజాగా నోటీసులు పంపింది. ఈ కేసు పూర్వాపరాలను నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నాయకులకు కూడా అధిష్టానం వివరించనుంది. ఆడిట్ పరంగా, న్యాయపరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు నాయకులు వెల్లడించారు. మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతా రెడ్డి, రేణుకాచౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.