Nampally Court records KTR statement in Defamation against Konda Surekha | హైదరాబాద్: కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లికోర్టుకు తెలిపారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో దాదాపు 20 నిమిషాలకు పైగా నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేటీఆర్ తో పాటు సాక్షులుగా బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. కేసు విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఆరోజు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు నమోదు చేయనుంది. 


కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం ఏం ఇచ్చారంటే..
నేను సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్నాను.  కొండా సురేఖ నాపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాను అన్నారు కేటీఆర్. అయితే కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని, వాటి వివరాలు చెప్పాలని కేటీఆర్‌ను జ‌డ్జి ప్ర‌శ్నించారు. అయితే మహిళ పట్ల తనకున్న గౌరవం కారణంగా సాటి మహిళ (నటి)పై కొండా సురేఖ సాటి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేనని కేటీఆర్ అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని మాత్రం రాతపూర్వకంగా కోర్టుకు అందిస్తున్నట్లు చెప్పారు. కుట్రపూరితంగా కొండా సురేఖ తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని  కేటీఆర్ ఆరోపించారు.


బాధ్య‌త గ‌ల మంత్రి ప‌ద‌విలో ఉండి కొండా సురేఖ తనతో పాటు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. తనను డ్ర‌గ్ అడిక్ట్ అని, పైగా రేవ్ పార్టీలు నిర్వహిస్తానని తీవ్ర ఆరోపణలు చేశారని కోర్టుకు కేటీఆర్ తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టీవీలో చూసిన సాక్ష్యులు తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని కేటీఆర్ తెలిపారు. సాక్షులు తనకు 18 ఏండ్లుగా తెలుసునని, వారి మాటలు విన్నాక టీవీ చూసి తాను కూడా షాకయ్యానని చెప్పారు. సాటి మహిళ అని చూడకుండా ఓ నటిపై సైతం అసభ్యకర కామెంట్లు చేయడం తగదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసినట్లు ఉందన్నారు. 


కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోవడంతో పరువునష్టం దావా


గతంలోనూ కేటీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సమయంలో కొండా సురేఖపై ఎన్నికల సంఘం మండిపడింది. ఆమెలో మార్పు రాకపోగా, ఈసారి అంతకుమించి దారుణ వ్యాఖ్యలు చేసి కొండా సురేఖ హాట్ టాపిక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోలేని స్థితికి వెళ్లగా, నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారని.. గొడవ అక్కడితో ఆపాలని నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. కొండా సురేఖ బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని ఆమెకు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆమె నుంచి సమాధానం రాలేదని సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా చేశారు. నేడు విచారణకు హాజరై కేటీఆర్ తన ఆవేదనను, జరిగిన విషయాన్ని నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు.


Also Read: ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !