వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నేలకొండపల్లి శివారులో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల నేడు (జూన్ 19) సమావేశం అయ్యారు. పాదయాత్రలో భాగంగా వారిని షర్మిల కలిశారు. పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌పై ఉన్న జనాలకు ఉన్న అభిమానమే తనకు, తన పార్టీకి ఉన్న ఆస్తిగా షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందని అన్నారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని వైఎస్‌ షర్మిల ఆకాంక్షించారు. 


1300 కిలో మీటర్లు నడిచింది తానే అయినా నడిపించిందని కార్యకర్తలే అని షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని అన్నారు. పువ్వాడ అజయ్‌కు తనను విమర్శించే స్థాయి లేదని చెప్పారు. బయ్యారం గనుల్లో తనకు షేర్ ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆ విషయంలో తన బిడ్డలపై కూడా ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మంత్రిగా అవినీతికి పాల్పడలేదంటూ తన పిల్లలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడ అజయ్ కు ఉందా? అని షర్మిల సవాలు విసిరారు. 


ఇప్పటికే పువ్వాడ అజయ్ సవాల్
అయితే, ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ చేశారు. పాలేరులో గెలిచి చూపించాలని షర్మిలకు సవాలు విసిరారు. ఇక, ఇప్పుడు షర్మిల అక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించటంతో ఆయన ఇంకా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


అక్కడి నుంచే ఎందుకంటే?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఆయా నియోజకర్గాల్లో కొత్తగూడెంలో బీసీలకు, ఖమ్మంలో కమ్మలకు, పాలేరులో రెడ్లకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. పాలేరు సెగ్మెంట్ ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అంతేకాక, ఎక్కువగా వైఎస్ఆర్ అభిమానులు ఇక్కడ ఉన్నారు.