Telangana News: భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ నేతలు వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. భువనగిరిలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌పైనే దాడికి పాల్పడ్డారు. సీఎంపై ఆయన చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూత్ కాంగ్రెస్ నేతల చర్యను బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. ఇలా ఆఫీస్‌లపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు మంచి చేసి ఉంటే... సక్రమంగా పాలిస్తుంటే కంచర్ల రామకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అంతే కానీ ఇలాంటి దాడులు చేయడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విధ్వంస రచన చేస్తున్నారని కాంగ్రెస్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేతలను, కార్యకర్తలను కొట్టడం, అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిందని అన్నారు. ఇలాంటి దాడులతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను, నేతలను రెచ్చగొడుతున్నారని ఇది మంచిది కాదని అన్నారు. భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలాంటి చర్యలు చేపడుతున్నారని అన్నారు. విమర్శలకు ప్రతివిమర్శ ఉండాలే తప్ప దాడులు సరికాదని హితవుపలికారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి సంస్కృతి ఎక్కువైపోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చచెప్పే మొహబ్బత్‌కి దుకాన్ అంతా ఫేక్ అని అన్నారు. అందుకు తెలంగాణలో హింసా రాజకీయాలే ఉదాహరణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గూండాలని, రౌడీలను పెంచి పోషిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఇప్పటికైనా పద్దతిగా లేకుంటే కచ్చితంగా తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
అసలేం జరిగిదంటే?బీఆర్‌ఎస్ యాదాద్రి భువనగరి జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. దీనికి నిరసగా యువజన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయంపైకి వచ్చారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ లీడర్లను అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆఫీస్‌లపై ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇది మర్చిపోక ముందే భువనగిరిలో ఇలాంటి తరహా దాడి జరగడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. భువనగిరి ఆఫీస్‌పై దాడి చేసన కాంగ్రెస్ నేతలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది మంచి పద్దతి కాదన్నట్టు హెచ్చరించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.