Krishna River Water Dispute | హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడేదే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాల విచారణకు అవసరమైతే తాను స్వయంగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట హాజరవుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, నిపుణులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు చర్చలు జరిపారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రతినీటి బొట్టును సాధించుకుందాం, ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదన్నారు.
కృష్ణా నదీ జలాల వివాదంపై వాదనలు వినిపిస్తున్న న్యాయనిపుణులు, న్యాయవాదులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో కృష్ణా నదీ జలాల అంశాలపై జరగనున్న విచారణపై అధికారులను, న్యాయనిపుణులను ఆయన ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నీటి కేటాయింపులు సక్రమంగా జరగకపోవడంతో దశాబ్దాల నుంచి తెలంగాణ ప్రజలు నష్టపోయారని మంత్రి ఉత్తమ్ అన్నారు.
గతంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ప్రశ్నించే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన అసమతుల్యతను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని, ఈ విషయంపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోమని, అవసరమైతే ట్రైబ్యునల్ ఎదుట తాను హాజరవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.