తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి టీఆర్‌ఎస్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో అక్రమాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. 


కుట్రలు చేసేందుకు మాత్రమే టైం ఉంటుంది..


సీఎం కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు కిషన్ రెడ్డి. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. ఏడాది తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మార్పు ఖాయమని అన్నారు. అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్న కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు... ఈడీ దాడులపై ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 


యాదాద్రి టు భద్రకాళి


24 రోజుల పాటు కొనసాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. యాదగిరి పల్లి, గాంధీ నగర్, గణేష్ నగర్, శుభం గార్డెన్, పాతగుట్ట, యాదగిరి గుట్ట ప్రధాన రహదారి గొల్ల గుడిసెలు, దాతారు పల్లి, బస్వాపూర్, గ్రామాల్లో పర్యటన సాగనుంది.  


కేసీఆర్‌ను జైలులో వేస్తాం..


బండి సంజయ్ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై న్యాయ బద్ధంగా పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే... కరుణానిధి, జయ లలిత, లాలూప్రసాద్ యాదవ్ అందరికీ గుర్తొస్తారని తెలిపారు. కేసీఆర్‌ను తప్పకుండా జైలులో వేస్తామని పునరుద్ధాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కేవలం 15 సీట్లు మాత్రమే గెలుస్తుందని అన్నారు. పాదయాత్రలో కేసీఆర్ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండ గడతానని బండి సంజయ్ అన్నారు. 


చికోటి వెనుక సగం మంది టీఆర్ఎస్ నేతలే..


చికోటి ప్రవీణ్ వెనుక సగం మంది తెరాస నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నేతలను తిట్టిన టీఆర్ఎస్ నేతలు.. వారం రోజులుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ద్వారా సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండగడతామని అన్నారు. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయం అని అన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల తన అభిప్రాయం చెప్పారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానమే చెప్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా భాజపా గెలుస్తుందన్నారు. తెలంగాణపై మోదీ, అమిత్ షాకు సంపూర్ణ విశ్వాం ఏర్పడిందన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోయేది బీజేపీయే అని అన్నారు.