టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరేందుకు కొందరు కీలక నేతలు చూస్తున్నారని ఈటల రాజేందర్ మరోసారి కామెంట్ చేశారు. ఓ ముఖ్య నేత తనకు ఫోన్ చేసి తాము బీజేపీ వైపు చూస్తున్నామని చెప్పినట్లుగా తెలిపారు. అయితే ఫోన్‌లో ఎందుకు చెప్తున్నావని.. తన ఫోన్ పోలీస్ టాపింగ్‌లో ఉండే అవకాశం ఉందని చెప్పానన్నారు. ఆయన ఇచ్చిన అతను ఇచ్చిన రిప్లైకి మతిపోయిందని ఈటల అన్నారు. ట్యాపింగ్‌లో వినాలనే ఇలా చెబుతున్నానని ఆ లీడర్ అన్నట్లుగా ఈటల చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఈటల ఈ కామెంట్స్ చేశారు.
దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసింది మోదీ
‘‘కేసీఆర్ నీ వెన్ను నీకు కనిపించడం లేదు.. కానీ ప్రజలకు కనిపిస్తుంది. 8 ఏండ్ల కాలంలో ప్రజలకు బాధ వస్తే ప్రగతి భవన్‌లో గానీ, సెక్రటేరియట్‌లో గానీ కలిసే అవకాశం ఉందా? నువ్వు మొత్తం ప్రగతి భవన్ సంకెళ్ళ మాటున ఉంటున్నావు. హుజూరాబాద్‌లో కేసీఆర్‌ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్‌కి దక్కింది. మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుంది. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పింది కేసీఆర్. అదే దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీది.’’ అని ఈటల అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాబోయే 20వ రాష్ట్రం తెలంగాణ
ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా గిరిజన బిడ్డలు పడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణమైన మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎలా కదిలి వచ్చారో.. ఇపుడు కేసీఆర్‌ను గద్దె దించడానికి అంతా ఏకమవుతున్నారు. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మేము కూడా బీజేపీలోకి వస్తామని అంటున్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 20వ రాష్ట్రంగా తెలంగాణ కాబోతుంది.’’ అని ఈటల రాజేందర్ మాట్లాడారు.
ఈటలపై కౌశిక్ రెడ్డి విమర్శలు
కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో యాక్టర్, హైదరాబాద్‌లో జోకర్ అని సంచలన కామెంట్ చేశారు. హుజూరాబాద్ అభివృద్ధికి బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రం నుంచి రూ.100 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాము రాష్ట ప్రభుత్వం నుంచి రూ.150 కోట్లు ఇస్తామన్నారు. కేసీఆర్‌పై ఈటల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఈటల పెద్ద మోసగాడని అన్నారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజలకు కూడా ఇప్పుడు ఈటల వెన్నుపోటు పొడుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నెల 5న హుజూరాబాద్‌లో చర్చకు ఈటల రాకపోతే, ఆయన అభివృద్ధి చేయలేదని అంగీకరించినట్టు అవుతుందని సవాల్ చేశారు.