Revatnh Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండలో చేపట్టిన నిరుద్యోగ ర్యాలీ విజయవంతంగా పూర్తి అయింది. రాత్రి వర్షం కురిసినప్పటికీ.. కాంగ్రెస్ శ్రేణులంతా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వాన్ని బండకేస కొట్టాలని అన్నారు. వంద మీటర్ల బొంద తీసి పాతి పెట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉద్యోగాలు ఊడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. అందుకు నల్గొండ బిడ్డలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇకపై కేసీఆర్ ను ఉద్యోగాలు అడిగేది లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని... రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలన్నారు. అందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని చెప్పారు. నిరుద్యోగులను తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.






30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఇంటికి వెళ్లలేక అడ్డా మీద కూలీల్లా బతుకుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్ లో పర్మిట్ రూమ్ అడ్డాల్లా మారాయంటూ ఫైర్ అయ్యారు. అకాల వర్షానికి పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే బీఆర్ఎస్ నేతలు తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నారన్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో పదవులు త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని వివరించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తరఫున హోమంత్రి చిదంబరానికి వినతి పత్రం అందించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని.. అలాగే జైపాల్ రెడ్డి అందరినీ ఒప్పించి తెలంగాణ బిల్ పాస్ చేయించారని రేవంత్ గుర్తు చేశారు. ఇంతటి మహనీయులు ఉన్న నల్గొండలో ప్రస్తుతం ఎలాంటి అధికారులు అధికారంలో ఉన్నారో చూసుకోవాలన్నారు. 






బంగారు తెలంగాణ ఎవరికి అయిందని, బిడ్డను బిల్లాను, అల్లున్ని అంబానీని, కొడుకును టాటాను చేశారన్నారు. కేసీఆర్ చార్లెస్ శోభరాజ్ అయ్యారని చెప్పుకొచ్చారు. మొదటి శాసన సభలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అడిగితే 1.07 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పారని... ఏడాదిలోని వీటిని భర్తీ చేస్తామన్నట్లు గుర్తు చేశారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత లక్షా 91 వేల 792 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ కమిషనే చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే పేద ప్రజలెవరికీ మంచి జరగలేదని.. ఉద్యోగాలు కూడా రాలేవని అన్నారు.