TGSRTC First Woman Driver | భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ట్రాన్స్‌జెండర్స్‌ను ట్రాఫిక్ పోలీస్ విధుల్లోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలను బస్సు డ్రైవర్లుగా నియమిస్తోంది. మహిళలను ఆర్టీసీలో డ్రైవర్లుగా నియామకం చేపట్టడంతో మారుమూల తండాలో పుట్టిన సరిత తొలి మహిళా డ్రైవర్‌గా విధుల్లో చేరారు.
భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తెలంగాణ ఆర్టీసీలో బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన తొలి మహిళగా నిలిచారు. తొలి రోజున విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు సరిత బస్ నడిపింది. సరిత గతంలో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించారు. తన కుటుంబ పరిస్థితిని వివరించగా తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అవకాశం కల్పించింది.
తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని, వారి బాధ్యతలు చూసుకోవడానికి ఆర్టీసీ బస్ డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సరిత కోరారు. సరిత కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రులు ఆర్టీసీ డ్రైవర్‌గా సరితకు తెలంగాణలో అవకాశం కల్పించారు. దాంతో ఆమె జూన్ 14న హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా నిలిచారు.