Telangana Minister Komatireddy: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పార్టీని వీడుతుంటే.. ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసుల  పై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తుంది. ఈ రోజు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇదే సందేహాన్ని లేవనెత్తుతున్నాయి. న‌ల్లగొండలో బీఆర్ఎస్  పార్టీ ఆఫీసును కూల‌గొట్టాలంటూ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఆఫీసును ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించారని పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు.


జులై 1న (సోమవారం) నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో  మంత్రి పాల్గొని మాట్లాడారు. పేదలు ప్రభుత్వ స్థలంలో ఇండ్లు కట్టుకుంటే ఊరుకోని అధికారులు.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ కోమటి రెడ్డి ప్రశ్నించారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మించారని ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలుపగా..  దానిని వెంటనే కూల్చివేయాలన్నారు. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు.  


కలెక్టర్ కు సూచనలు
నల్గొండ పట్టణంలో‌ పర్మీషన్ తీసుకోకుండా  ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్  జిల్లా కార్యాలయంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. కోట్లు విలువ చేసే  ప్రభుత్వ స్థలంలో పర్మిషన్స్ లేకుండా పార్టీ ఆఫీసు ఎలా నిర్మిస్తారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటేనే సవాలక్ష రూల్స్ పెట్టే మీరు కోట్లు విలువ చేసే భూమిలో పార్టీ ఆఫీసు కడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.  వెంటనే ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కోమటి రెడ్డి సూచించారు.


ఆగస్టు 15లోపు రుణమాపీ  
వచ్చే నెల 15లోపు రూ.32 వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తున్నామని మంత్రి  కోమటిరెడ్డి అన్నారు.  రైతులకు రూ.2లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రైతులకు రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు.  పైసా పైస పోగు చూసి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.  యావత్ తెలంగాణ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, అందుకు రైతు రుణమాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు.