ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడు సాధించానని, ఈ ఘనత, గౌరవం, కీర్తి ఎప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాకే దక్కుతుందన్నారు సీఎం కేసీఆర్. మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ మొదట టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. అద్భుతమైన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకొని, తన చేతుల మీదుగా ప్రారంభం చేయించినందుకు జిల్లా ప్రతినిధులు, ప్రజలందరినీ అభినందించారు. పాలమూరు ఇచ్చిన స్ఫూర్తితోనే జాతీయ రాజకీయాల్లోనూ విజయం సాధించుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని, తెలంగాణ తరహాలోనే దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ ను కూల్చే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుందన్నారు. మోదీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని, ఏ విషయంలోనూ సహకారం అందించడం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 8 ఏళ్లు పూర్తయినా కృష్ణా జలాల్లో వాటా తేల్చలేకపోయారని, ఇక అనుమతులు వచ్చేది ఎప్పుడు అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించినందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, మొన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కొందరు దొంగలు రాష్ట్రాని వస్తే.. వాళ్లను పట్టుకుని జైళ్లో పెట్టామంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ప్రధాని మోదీ చెప్పారని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బీజేపీకి తెలిసిన ప్రజాస్వామ్య విధానమా అని కేసీఆర్ మండిపడ్డారు.
అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్‌లు
పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగా, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్‌లు నిర్మించుకుంటున్నాం అన్నారు. తాజాగా పాలమూరు జిల్లా కలెక్టరేట్ ప్రారంభమైందని, మిగతా జిల్లాల్లో త్వరలోనే కలెక్టరేట్లు ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ మలిదశ ఉద్యమం కొనసాగుతుండగా తాను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. ఎప్పటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతాయన్నారు.
‘సమైక్య పాలనలో జిల్లా నిరాధరణకు గురైంది. వలసలతో ఉండే మహబూబ్ నగర్ ఇప్పుడు పచ్చబడ్డ జిల్లాగా మారింది. త్వరలోనే మహబూబ్ నగర్ ఐటీ, పారిశ్రామిక హబ్ గా మారుతోంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే బాగుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సహకరించడం లేదు. రాష్ట్రం వస్తే పాలమూరు బ్రహ్మాండంగా మారుతుందని 20 ఏళ్ల కిందట చెప్పిన మాటలు నిజమవుతున్నందుకు సంతోషంగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడి రైతులకు అందజేస్తున్న పథకాలు అలా ఉన్నాయి. గతంలో రూ.50 వేల కోసం కాళ్లు అరిగేలా తిరిగేవారు. కానీ టీఆర్ఎస్ పాలనలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రమాదవశాత్తూ ఎవరైనా రైతు చనిపోతే రైతు భీమా కింద వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆదుకుంటున్నాం. సొంత జాగా ఉన్న వాళ్లకు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేసి పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తాం. నియోజకవర్గానికి 1000 ఇళ్లు చొప్పున త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేస్తుందని’ మహబూబ్ నగర్ లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.