Komatireddy Venkat Reddy: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. రాష్ట్రంలో మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు అవ్వబోతుందని అన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాబోతున్నారని చెప్పారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల సమీపంలో నేషనల్ హైవే నిర్మాణ పనులను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య మంత్రిగా ఎవరు ఉన్నా సరే తొలి సంతకం రూ.4 వేల రూపాయల పెన్షన్ పైనే చేస్తారని చెప్పారు. ఈ నెల 20 వ తేదీన కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని చెప్పారు. ఆ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని వెల్లడించారు. 


గౌరెల్లి నుండి కొత్తగూడెం వరకు రూ.2 వేల కోట్లతో నేషనల్ హైవేను కేంద్ర మంత్రితో మాట్లాడి తానే మంజూరు చేయించానని చెప్పారు. స్థానిక ఎంపీ కోరితే జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని, మంత్రి కేటీఆర్ కు ఆ విషయం కూడా తెలియదని కోమటిరెడ్డి అన్నారు. పైగా అమెరికాలో చదువుకొని వచ్చానని చెబుతారని ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రి అయి ఉండి కూడా కేటీఆర్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.


స్కూటర్ పై తిరిగిన జగదీష్ రెడ్డి - కోమటిరెడ్డి


మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో స్కూటర్ మీద తిరిగిన మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు రూ.వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన రూ.3 వేల కోట్లతో శంషాబాద్ దగ్గర 80 ఎకరాల భూమి కొన్నారని ఆరోపణ చేశారు. అక్రమ సంపాదన విషయంలో గ్యాదరి కిషోర్, మంత్రి జగదీశ్ రెడ్డితో ఒకరికొకరు పోటీపడుతున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాలో, లిక్కర్ మాఫియాలో, గల్లీల్లో తిరిగే గ్యాదరి కిషోర్ కు అసలు ఢిల్లీ ఎక్కడ ఉందో తెలుసా అని ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారిన గుత్తా సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతున్నారని, ఆయనకు అంత ప్రాణ భయం దేనికని ప్రశ్నించారు.


తాను బెంజ్ కారులో తిరుగుతానని కొంత మంది తనను విమర్శి్స్తుంటారని కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. కానీ తాను 30 సంవత్సరాల క్రితమే యూత్ కాంగ్రెస్ ఉండగానే, బెంజ్ కారు ఉండేదని గుర్తు చేశారు. అప్పుడే తాను బెంజ్ కారులో తిరిగేవాడినని అన్నారు. తాను తొలి నుంచి కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించానని అన్నారు. అంతేకాని, జగదీష్ రెడ్డిలా స్కూటర్ మీద తిరిగి అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదని అన్నారు. అవినీతి, తెలంగాణలో లూటీలు ఆగాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.