Kodad Road Accident:సూర్యపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. 42 మందితో వెళ్తున్న ట్రావెల్ బస్‌ కంటైనర్‌ను ఢీ కొట్టింది. అందులో ఉన్న ఇనుప రాడ్స్‌ బస్‌లో ఉన్న పాసింజర్స్‌ శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. వీరిలో నలుగురైదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Continues below advertisement

ప్రమాదానికి గురైన బస్‌ హైదరాబాద్ నుంచి ఏలూరు  వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు అందులో 42 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటన కారణంగా ఆ రూట్‌లో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ప్రమాదం జరిగిన బస్‌ను కంటైనర్‌ను రోడ్డు పక్కకు తీయడంతో వాహనాలు రాకపోకలు ఈజీ అయ్యాయి.    

ప్రమాదానికి కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా లేకుంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.   

Continues below advertisement

కోదాడ వద్ద ప్రమాదంపై పవన్ విచారం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట, కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సు భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో రాజీ పడకూడదన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాలన్నారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.