Sagar Water Release:  నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసుల్ని భారీగా మోహరించారు.  ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. అయితే ఏపీ పంతం నెగ్గించుకుంది. ఎట్టకేలకు నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదలైంది. సాగర్ ప్రాజెక్ట కుడి కాల్వకు నీటిని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 2వేల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతలో తెలంగాణ అధికారులు షాక్ ఇచ్చారు


సాగర్ ప్రాజెక్ట్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్


నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు. ఏపీ వైపు వాహనాలకు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక విద్యుత్‌తో ఏపీ అధికారులు  దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


షాక్ ఇచ్చిన తెలంగాణ అధికారులు


దౌర్జన్యంగా నీటిని విడుదల చేసినంతసేపు లేదు...ఇంతలో తెలంగాణ అధికారులు షాకిచ్చారు.  సాగర్ నీటి విడుదలకు బ్రేక్ పడింది. నాగార్జునసాగర్ కు చెందిన 13 గేట్లను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు తాత్కాలిక విద్యుత్‌తో నీటిని విడుదల చేశారు....ఆ కాసేపటికే తెలంగాణ అధికారులు విద్యుత్ నిలిపేసి షాకిచ్చారు. మోటార్లకు కరెంట్ సరాఫరా నిలిపివేశారు. దీంతో నీటి విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఏపీ అధికారులు కరెంట్ సరాఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


బుధవారం అర్థరాత్రి నుంచి మొదలైన రచ్చ


ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్‌ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  రెండు రాష్ట్రాలకు చెందిన వందల మంది పోలీసులు అక్కడ భారీగా మోహరించడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డ్యామ్ పై ఉన్న పరిస్థితిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.


సాగర్ వద్ద ఉద్రిక్తతపై రాజకీయ దుమారం


ఈ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు  ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ విషయంపై స్పందించిన  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్..రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. 


తెలంగాణ పోలీసుల కంట్రోల్లో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కి ఏపీ పోలీసులు వెళ్లడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న రోజునే కావడంతో అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వ చర్యలపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే సాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.