President of India Droupadi Murmu: పోచంపల్లి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Droupadi Murmu) యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో విపరీతమైన గాలి వీచడంతో పోలీసులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఉప్పటల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్న రాష్ట్రపతి ముర్ము..
పోచంపల్లి (Pochampalli) పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ముర్ము చేనేత కార్మికులను చూడగానే ఆనందం కలిగిందన్నారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము చేనేత మగ్గాలను, టై అండ్‌ డై ఇక్కత్‌ పట్టు చీరల తయారీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర రంగాలతో పోల్చితే చేనేత కళ భిన్నమైందని అభిప్రాయపడ్డారు. ఫ్యాషన్‌ డిజైన్‌ రంగంలో ఇక్కడి చేనేత కార్మికులు విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు. తరువాత తరాలకు చేనేత కళను అందిస్తున్న వారిపై ప్రశంసలు కురిపించారు. పోచంపల్లి చేనేత కార్మికులు తనకు ఇచ్చిన సలహాలపై ఆలోచిస్తానన్నారు. పోచంపల్లి అభివృద్ధికి, చేనేత కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేయడానికి ఎప్పుడూ సిద్ధమే నంటూ అక్కడి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.