భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య ఉన్న పోరు కాస్తా ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మూడు నెలల క్రితం పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ రెండు వర్గాల మధ్య పోరు బయటపడింది. విగ్రహావిష్కరణకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మాజీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి రావడంతో రేగా వర్గీయులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పట్నుంచి ఈ రెండు వర్గాల మధ్య పోరు నడుస్తూనే ఉంది. తన అనుమతిలేకుండా నియోజకవర్గంలోకి ఎలా వస్తారు అని రేగా కాంతారావు ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత సైతం అనేక మార్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరుచూ ఈ నియోజకవర్గంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. వీరి మధ్య వర్గపోరు అప్పట్నుంచి నివురుగప్పిన నిప్పులానే ఉంది.
తుళ్లూరి బ్రహ్మయ్యపై దాడితో..
ఇటీవల డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యపై దాడి జరిగింది. మాజీ ఎంపీ పొంగులేటికి ప్రధాన అనుచరుడిగా ఉన్న బ్రహ్మయ్యపై దాడి జరగడంతో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. ఓ భూపంచాయితీ నడుస్తుండగా బ్రహ్మయ్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంపై వివాదం నడుస్తుండగా ఇటీవల అశ్వాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు ‘తాను తుపాకీ కాల్చగలను.. కత్తి తిప్పగలను..’ అనే వ్యాఖ్యలు చేయడంతో మరోమారు రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్యే కాంతారావుపై ఇప్పుడు పొంగులేటి వర్గీయుడైన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎదురుదాడి ప్రారంబించారు. ఎమ్మెల్యే రేగాకు అంతసీన్ లేదని, రౌడీ రాజకీయాలతో తమను ఏమి చేయలేరని కామెంట్ చేశారు. రెండు వర్గాల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది.
వర్గపోరులో పై చేయి ఎవరిది..?
ప్రభుత్వ విప్‌గా ఉన్న రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తన నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ హాజరవుతున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సైతం బలమైన క్యాడర్ ఉంది. పినపాక నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతోపాటు డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎంపీ పొంగులేటి వర్గంలో ఉన్నారు. రెండు బలమైన వర్గాల మధ్య సాగుతున్న వర్గపోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇద్దరు ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికై టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నవారు కావడం గమనార్హం.