Nalgonda Latest News: నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. దేవరకొండ నియోజకవర్గంలోని కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో రాత్రి పూట నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో 14 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు ఈరోజు గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, సమస్యలలను అడిగి తెలుసుకున్నారు.


రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, డాక్టర్ గ్యాదరి కిశోర్ కుమార్, ఎన్. భాస్కర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు విద్యార్థులను పరామర్శించారు.


సీఎం మొద్దు నిద్ర
స్వయానా ముఖ్యమంత్రే విద్యా శాఖా మంత్రిగా ఉన్నా.. మైనార్టీ గురుకులాలకు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు. అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు ఉన్నాయి. అటు విద్య లేదు.. ఇటు భోజనం లేదు. కనీస సౌకర్యాలు లేవంటూ కన్నీటి పర్యంతమైన విద్యార్థులను చూస్తుంటే మాకు కన్నీళ్ళు ఆగలేవు. గురుకులాల్లో విద్యార్థులు ఒకవైపు పాములు కుట్టి చనిపోతుంటే.. మరోవైపు ఎలుకలు కరిచి, విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే.. మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్’’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.