కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న అనే ఎంబీబీఎస్ విద్యార్థిని యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో భయంతో అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న (21)కు డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉండేది. చదువులో రాణించి సత్తాచాటిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన సెలవుల్లో గ్రామానికి తిరిగి వచ్చిన క్రమంలో శుక్రవారం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. మరోవైపు, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్(25) మృతదేహం శనివారం (జూలై 18) తాటి చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
స్థానికుల సమాచారం ప్రకారం, ప్రసన్న మృతిలో చరణ్ పాత్ర ఉందేమోనని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు యువకుడు రామ్ చరణ్‌ను మందలించినా అతడు మారలేదు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తూనే ఉన్నాడు. అందువల్లే లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరి ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ పోలీసులు ఏమన్నారంటే?నల్గొండ పోలీసు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మేం అనుమానాస్పద మృతిగా విడివిడిగా కేసులు నమోదు చేశాము. ప్రేమ వ్యవహారం, వేధింపుల ఆరోపణలతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టాం. నిజనిజాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం రిపోర్ట్, కాల్ డేటా రికార్డులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలం సేకరించనున్నాం. ప్రజలు వీరి మృతిపై ఎలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని, దర్యాప్తు సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని చెప్పారు. వీరిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపినట్లు అధికారి తెలిపారు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల స్టేట్‌మెంట్ల నమోదుకట్టంగూర్ పోలీసులు అటు ప్రసన్న బంధువులు, ఇటు చరణ్ కుటుంబ సభ్యులు, అలాగే వారిద్దరి గురించి తెలిసిన గ్రామస్తులను ప్రశ్నించి స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. వారిలో ఎవరిపైనైనా మానసిక ఒత్తిడి, బెదిరింపులు లేదా వేధింపులు ఉన్నట్లు ఫిర్యాదులు, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చే వరకు అధికారులు ఇద్దరి మరణాలను అనుమానాస్పద మృతిగానే భావిస్తామని చెప్పారు. యువతిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా మరేదైనా నేరానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.
