KA Paul Comments In Kurnool: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం చాలా డేంజర్ అని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్న మాట నిజమేనని అన్నారు. అలాంటి పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తే అది అంతకన్నా పెద్ద ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన పార్టీ అని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపితే తాను కలుస్తానని, సాదరంగా ఆహ్వానిస్తానని అన్నారు. తన టీం సభ్యులు రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని, ఆయన ఆసక్తిగానే ఉన్నట్లుగా కేఏ పాల్ చెప్పారు. కేఏ పాల్ ఏపీలో అన్ని జిల్లాల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ముగింపు సమావేశం కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘‘రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటే, ఆయనకు 25 వేల కోట్ల మేలు కలుగుతున్నట్లుగా అనుమానం కలుగుతుంది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి. మరి మేమైతే మా పార్టీలో చేరితే బీజేపీ వాళ్లు ఇచ్చినట్లుగా రూ.25 వేల కోట్లు కాదుకదా.. 25 లక్షలు కూడా ఇవ్వలేం. నేను ప్రచారం చేస్తే ఆయన కచ్చితంగా గెలుస్తారు. బీజేపీ తరపున ఆయన నిలబడితే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు? బీజేపీ నుంచి పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలవరు.’’
‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా? అనే అంశంపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను ఇప్పుడు 18 రాష్ట్రాల టూర్ చేస్తున్నా. ప్రస్తుతం 2 రాష్ట్రాల పర్యటన సాగుతోంది. 120 మంది కోర్ కమిటీ లీడర్స్, కోఆర్డినేటర్స్ తో మధ్యాహ్నం 4 నుంచి 6 వరకూ మామూలు సమావేశం, 8 నుంచి 10 వరకూ ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలవాలా లేదా? నిలిస్తే ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని కేఏ పాల్ వెల్లడించారు.
మునుగోడు ప్రజలు అన్ని పార్టీల పనితీరు చూశారని, ఈ సారి తమ అభ్యర్థిని గెలిపిస్తే కేవలం 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. తనపై దాడికి యత్నించిన తిరుపతి సీఐ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.