Bandi Sanjay Campaign For Munugode ByElections: ఎలాగైనా సరే మునుగోడు ఉప ఎన్నికల్లో తామే విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచిగా ప్రజలు ఈ ఫలితాన్ని తీసుకోవాలంటే.. మునుగోడులో తమ జెండా ఎగురవేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చౌటుప్పల్ లో ఇంటింటి ప్రచారానికి బయలుదేరారు. చౌటుప్పల్ లోని చిన కొండూరు రోడ్డు సమీపంలో ఉన్న రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి సంజయ్. అనంతరం 11వ వార్డుకు చేరుకుని ప్రచారం మొదలుపెట్టారు.


బండి సంజయ్ వినూత్న ప్రచారం
ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచిన బండి సంజయ్ నేడు వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. రామాలయంలో పూజలు ముగిశాక కమలం పూలతో ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతిపాత్రమైన వికసించిన కమలం పూలను చేతిలో పెట్టి 11వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇంటింటికి వెళ్లి మహిళలకు కమలం పూలను అందజేసి, పువ్వు గుర్తుకు ఓటేయండి..  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు తరలిరాగా, అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. ఈ ప్రచార కార్యక్రమంలో ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.


దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పారని, మునుగోడు ప్రజలు సైతం ఆ పార్టీని బండకేసి బాదాలంటూ మునుగోడు ఓటర్లను బండి సంజయ్ కోరారు. ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ప్రజలకు ఆయన విజ్ఝప్తి చేశారు. పేదల బతుకులు బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలి... నవంబర్ 3న జరిగే ఎన్నికలో కమలం గుర్తుపై ఓటేసి ప్రజల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని... అప్పుడే పేదల రాజ్యం వస్తుందన్నారు బండి.





ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్..
ఇవి కేవలం మునుగోడు ఎన్నికలు మాత్రమే కాదు అని.. తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడి ఉన్న ఎన్నికలు అని బండి సంజయ్ అన్నారు. పొరపాటున టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ లో అహంకారం తలకెక్కుతుందని జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోయినా, ఉద్యోగాలివ్వకపోయినా, దళిత బంధు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వకపోయినా ఓట్లు వేశారనే భావనతో ఫాంహౌజ్ కే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి మునుగోడు ప్రజలు అన్నీ ఆలోచించి ఓటేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్చరించారు.


కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పరోక్షంగా తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో సాయం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే వెంకట్ రెడ్డికి సంబంధించిన ఆడియో, వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ ఓటమిపై చర్చ జరుగుతోంది.