Munugode By-election Results 2022 Live: మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు - కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించి లైవ్ అప్ డేట్లు మీరు ఇక్కడ చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Continues below advertisement

LIVE

Background

మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ సెమీ ఫైనల్స్‌గా భావించాయి. ఇక్కడ గెలిచే పార్టీకి ఫైనల్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మకంగా చెబుతూ వచ్చాయి. అందుకే శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. ఏడాది్ మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి .. పూర్తి సమయం వెచ్చించడానికి వెనుకాడలేదు. ఇప్పుడు ఫలితం వచ్చేసింది. మరి గెలిచిన పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా ? రెండు, మూడు స్థానాల్లో ఉన్న పార్టీలు ఆశలు వదిలేసుకోవాల్సిందేనా ? 

మునుగోడు గెలుపు ఆత్మవిశ్వాసం ఇస్తుంది తప్ప.. రాజకీయ ప్రయోజనం కల్పించదు !

రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. నెల రోజుల తర్వాత మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన పార్టీ గురించి చెప్పుకోడం తగ్గిపోతుంది. అప్పటి రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. మునుగోడులో గెలిచిన విషయాన్ని ఆరు నెలల తర్వాత ఎవరూ గుర్తుంచుకోరు. అందుకే ఈ ఫలితం వల్ల ఇప్పటికిప్పుడు విజేతకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ.. ప్రజలు తమ వైపే ఉన్నారన్న ఓ కాన్ఫిడెన్స్ ను మాత్రం ఈ విజయం ఇచ్చింది. అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న ఓ అభిప్రాయాన్ని ఈ ఫలితం పటాపంచలు చేస్తుంది. పక్క చూపులు చూసేవారిని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. 

ఉపఎన్నిక .. ఓ అంశంపై జరిగిన ఎన్నిక !


మునుగోడు ఉపఎన్నికకు ఎజెండా అంటూ లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఆయనకు మాత్రమే తెలుసు. ప్రజలకు తెలిదు. ప్రజలకు అవసరం లేదు కూడా. ఉపఎన్నిక ఎందుకొచ్చిందో వాళ్లు పట్టించుకోలేదు. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఈ ఉపఎన్నికలో గెలవాలన్న ఎజెండా ఉంది. అందుకే ఇష్టారీతిన ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయత్నతించాయి. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ఓటింగ్ ఎజెండా ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోలేదు. తమకు ఎక్కువ ప్రయోజనం కల్పించిన వారికో.. లేకపోతే మరో కారణంతోనే ఓటేశారు కానీ.. ఎమ్మెల్యేలను లేదా.. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడాని కాదు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలన్నది ఎజెండా.. ప్రజలు ఓట్లేసేదీ ఆ కోణంలోనే !

అసెంబ్లీ ఎన్నికలు జరిగితే... ప్రచారాంశాలు .. ఎజెండా పూర్తిగా మారిపోతాయి. ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లేసేది ప్రభుత్వాలను మార్చడానికి కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓట్లేసేది.. ప్రభుత్వాలను మార్చడానికి లేదా.. కొనసాగించడానికి. ఈ ఎజెండా ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు. అందుకే ఉపఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయి. 2017లో నంద్యాలలో ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించింది. కానీ సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. నంద్యాలలో కూడా ఓడిపోయింది. అక్కడ ప్రజలు ఉపఎన్నికల్లో ఆలోచించిన విధానం వేరు..  అసెంబ్లీ ఎన్నికల సమయానికి వారి ఓటింగ్ ప్రయారిటీ మారిపోయింది. ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. ఇదే కోణంలో ఎన్నికలు జరుగుతాయి. 

మునుగోడు ప్రభావం ఫైనల్స్‌పై ఏమీ  ఉండదు !

రాజకీయ పార్టీలు ఉపఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా.. ఎలాంటి ప్రభావం ఉండదు. ఫైనల్స్‌లో మాత్రం ప్రజలు ఓట్లేసే విధానం వేరు. అయితే ఉపఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతాలు మరీ తక్కువగా ఉంటే.. ఆ పార్టీ మరీ చిక్కిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఆయా పార్టీలకు మంచిది కాదు. 

Continues below advertisement
18:41 PM (IST)  •  06 Nov 2022

మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు - కేటీఆర్

నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలను  టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టులతో తెచ్చిన ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో కళ్లు నెత్తికొక్కి మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారని కేటీఆర్ విమర్శించారు. దిల్లీ బాసులు మోదీ, అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో కనిపించింది రాజగోపాల్ రెడ్డి అయినా వెనకుండి నడిపించింది దిల్లీ బాసులు అని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:33 PM (IST)  •  06 Nov 2022

మునుగోడులో కారుదే హవా, 10 వేలకు పైగా మెజార్టీ

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేలకు పైగా మెజార్టీ సాధించారు. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6608, బీజేపీకి 5553 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1055 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మొత్తం మెజార్టీ 10191 ఓట్లకు చేరింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. 

16:44 PM (IST)  •  06 Nov 2022

13వ రౌండ్ లోనూ గులాబీ పార్టీదే హవా, 9 వేలకు పైగా ఆధిక్యం  

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 13వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి 6619 ఓట్లు, బీజేపీకి 5406 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1285 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 9136 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. 

15:59 PM (IST)  •  06 Nov 2022

Munugode bypoll : 12వ రౌండ్  టీఆర్ఎస్ దే, 7 వేలు దాటిన ఆధిక్యం 

Munugode bypoll :మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు 12 రౌండ్లు ముగిశాయి. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7440 ఓట్లు, బీజేపీకి 5398 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం 7836 ఓట్లకు చేరింది. 

15:16 PM (IST)  •  06 Nov 2022

Munugode By Elections News: 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌దే పై చేయి, మొత్తం కలిపి 5,765 ఓట్ల మెజారిటీ

మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. 11వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం కనబర్చింది. 11వ తర్వాత టీఆర్ఎస్ కు 5,765 ఓట్ల మెజారిటీ వచ్చింది. 

15:09 PM (IST)  •  06 Nov 2022

Munugode Counting : 10వ రౌండ్ లోనూ కారు జోరు, 4 వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం 

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతోందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. 10వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అధిక్యంలో నిలిచింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి 7499 ఓట్లు రాగా, బీజేపీకి 7015 ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి 484 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా 4416 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ నిలిచింది. 

14:31 PM (IST)  •  06 Nov 2022

Munugode Election News: 9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీనే లీడ్, మొత్తం కలిపి 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీ

9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం కనబర్చింది. 9వ రౌండ్‌లో టీఆర్ఎస్‌లో 850 ఓట్ల ఆధిక్యం సాధించింది. మొత్తం 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4 వేల ఓట్ల ఆధిక్యం సంపాదించింది. 9, 10 రౌండ్లలో చండూరు మండల ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఈ ప్రాంతాలు తమకు బాగా ఓట్లు కురిపిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే, 9వ రౌండ్ కూడా టీఆర్ఎస్‌కే సొంతం అయింది. మొదట్లో చౌటుప్పల్ మండలంలో కూడా బీజేపీకి ఎక్కువ మెజారిటీ వస్తుందనుకొని భావించినా అక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చిన సంగతి తెలిసిందే.

14:07 PM (IST)  •  06 Nov 2022

Munugode Election Counting Latest News: 8వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత

ఎనిమిదో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ కే ఆధిక్యం దక్కింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు 536 ఓట్ల లీడ్ లభించింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 6,624, బీజేపీకి 6,088 ఓట్లు వచ్చాయి. మొత్తం ఈ 8 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ కు 3,091 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మొత్తం 1, 4, 5, 6, 7, 8 రౌండ్లలో ఆధిక్యం లభించినట్లయింది. కేవలం 2, 3 రౌండ్లలోనే బీజేపీకి ఆధిక్యంలో ఉండగలిగింది. 

13:32 PM (IST)  •  06 Nov 2022

Munugode Elections Live: ఏడో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

ఏడో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,189, బీజేపీకి 6,803 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్ ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటివరకూ వచ్చిన ఓట్లు ఇవీ..
టీఆర్ఎస్ - 45,710
బీజేపీ - 43,155

12:52 PM (IST)  •  06 Nov 2022

TRS Lead in Munugode: ఆరో రౌండ్‌లో కూడా TRS టీడ్

ఆరో రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం కనబర్చింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 2,169 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,016 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5,378 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఏడవ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 

12:30 PM (IST)  •  06 Nov 2022

Munugode Results Live: ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్


  • మునుగోడు ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్

  • ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ కు 1,631 ఓట్ల ఆధిక్యం

  • ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 6,162, బీజేపీకి 5,245 ఓట్లు

  • ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ 917 ఓట్ల లీడ్ 

  • ఒకటి, నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్‌కు ఆధిక్యం

  • రెండు, మూడు రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం

12:15 PM (IST)  •  06 Nov 2022

Munugode Election Counting: ఫలితాల వెల్లడిలో జాప్యంపై క్లారిటీ ఇచ్చిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

మునుగోడు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిలో జాప్యంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 4th రౌండ్ కి 5th రౌండ్ కి 20 నిమిషాలు లేట్ అయ్యింది అంతేనని అన్నారు. ఏదైనా కారణం వల్ల లేట్ అయితే తాము ఏమి చేయగలమని అన్నారు. మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే లేట్ అవుతుందని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తరువాతనే రిజల్ట్ లు రౌండ్ ల వారీగా వస్తాయని చెప్పారు. ప్రతి రౌండ్ ముగియగానే మీడియాకు సమాచారం ఇస్తున్నామని అన్నారు.

11:39 AM (IST)  •  06 Nov 2022

TRS Fires on Election Counting Process: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పైన టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం

 


రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

11:35 AM (IST)  •  06 Nov 2022

Bandi Sanjay on Munugode Election Counting: సీఈవో వైఖరి అనుమానాస్పదంగా ఉంది - బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా సీఈవో ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ నిలదీశారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

11:31 AM (IST)  •  06 Nov 2022

Kishan Reddy: చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు కేంద్రమంత్రి ఫోన్, ఫలితాల విడుదలలో జాప్యంపై ఆగ్రహం


  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్

  • రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం

  • ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

  • కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసిన సీఈవో

  • మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్

11:30 AM (IST)  •  06 Nov 2022

Munugode Election Counting News: ఐదో రౌండ్ ఫలితాలు మరీ జాప్యం

మునుగోడు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటనలో జాప్యం


మొదటి  నుండి నాలుగో రౌండ్ వరకు వెంట వెంటనే ఫలితం విడుదల


ఆలస్యమవుతున్న ఐదో రౌండ్ ఫలితం

10:46 AM (IST)  •  06 Nov 2022

Komatireddy Rajagopal Reddy: బీజేపీనే గెలుస్తుందనే నమ్మకం ఉంది - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఓవైపు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుండగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు. కానీ, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది’’ అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

10:26 AM (IST)  •  06 Nov 2022

Munugode Election Counting News Live: నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తి, టీఆర్ఎస్ లీడ్ 334 ఓట్లు

నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ - 4,854  


బీజేపీ - 4,555


టీఆర్ఎస్ లీడ్ - 299


నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీఆరెఎస్ లీడ్ 334 ఓట్లు

09:52 AM (IST)  •  06 Nov 2022

KA Paul: కేఏ పాల్‌కు మొదటి రెండు రౌండ్లలో 88 ఓట్లు

మొదటి రెండు రౌండ్లలో కేఏ పాల్‌ కు 88కి పైగా ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో ఆయనకు 34 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ఈవీఎంల విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లు పెట్టాలని తాను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నానని అన్నారు. కోర్టుకు కూడా వెళ్లామని చెప్పారు. ఎన్నికలు 3వ తేదీన ముగిస్తే, కౌంటింగ్ 6వ తేదీన ఎందుకు పెట్టారని, మరుసటి రోజే పెట్టి ఉండాల్సిందని అన్నారు. అంతేకాక, రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఎం కేసీఆర్ చెప్పు చేతల్లో పని చేస్తున్నారని, కేంద్ర అధికారులతో ఎన్నికలు పెట్టాలని తాము ముందే చెప్పానని కేఏ పాల్ అన్నారు.

09:44 AM (IST)  •  06 Nov 2022

Palvai Sravanthi: కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయి స్రవంతికి బీజేపీ, TRS కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

09:42 AM (IST)  •  06 Nov 2022

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జిగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ లీడ్

3వ రౌండ్ ముగిసేసరికి ఓవరాల్ గా 500 పైచిలుకు ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉంది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న అరెగూడెం, రెడ్డి బావిలో బీజేపీకి లీడ్ వచ్చింది.

09:39 AM (IST)  •  06 Nov 2022

BJP Lead in Third Round: మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్ కాగా, రెండో రౌండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. మూడో రౌండ్ కూడా బీజేపీనే ఆధిక్యంలో నిలిచింది. దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.

09:32 AM (IST)  •  06 Nov 2022

Munugode Bypoll: రెండో రౌండ్‌లో బీజేపీ ముందంజ

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ ముందంజలోకి వచ్చేసింది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో రౌండ్ లో 900 పైచిలుకు ఓట్ల లీడ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.

09:00 AM (IST)  •  06 Nov 2022

Munugode First Round Results: తొలి రౌండ్ లో ఫలితాలు ఇవీ

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ - 6096


బీజేపీ - 4,904


కాంగ్రెస్ - 1877


లీడ్ - 1192

08:49 AM (IST)  •  06 Nov 2022

Munugode Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ 

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.


టీఆర్ఎస్ - 228


బీజేపీ - 224 


బీఎస్పీ - 10


4 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

08:24 AM (IST)  •  06 Nov 2022

Munugode Bypoll Counting News Live: ఓట్ల లెక్కింపు తీరు ఇలా


  • 1, 2, 3 రౌండ్లు చౌటుప్పల్

  • 4, 5, 6 రౌండ్లు నారాయణపురం

  • 7, 8 రౌండ్లు మునుగోడు

  • 9, 10 రౌండ్లు చండూరు

  • 11, 12, 13, 14, 15 రౌండ్లు మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్

  • తొలుత చౌటుప్పల్ మండలం లెక్కింపు

  • చివరకు గట్టుప్పల్ మండల ఓట్లు లెక్కించనున్న అధికారులు

08:23 AM (IST)  •  06 Nov 2022

Munugode Winner: మధ్యాహ్నం ఒంటి గంటకు విజేత ఎవరో తేలే అవకాశం


  • మధ్యాహ్నం 1 గంటల వరకు తేలనున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం

  • మునుగోడులో మొత్తం మండలాలు - 7

  • బూత్ ల సంఖ్య - 298

  • చౌటుప్పల్  - 68

  • నారాయణపురం - 54

  • మునుగోడు - 44

  • చండూరు - 40

  • మర్రిగూడ - 33

  • నాంపల్లి - 43

  • గట్టుపల్ - 16

  • మొత్తం ఓట్లు - 2,41,805

  • పోలైన ఓట్లు 2,25,192

  • పోలింగ్ శాతం - 93.13

  • గతసారి శాతం 91.31

08:20 AM (IST)  •  06 Nov 2022

Munugode By Election Counting Starts: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం


  • మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

  • ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

  • ఆ తర్వాత ఈవీఎంలను తెరువనున్న అధికారులు

  • మొత్తం 15 రౌండ్ల పాటు కౌంటింగ్ 

  • మొత్తం 23 టేబుల్స్ ఏర్పాటు

  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్స్ కేటాయింపు

  • ఒక్కో టేబుల్ పై ఒక్కో బూత్ ఓట్ల లెక్కింపు

  • ఒక్కో రౌండ్ 21 బూత్ ల ఓట్ల లెక్కింపు

  • మొదటి మూడు రౌండ్లు చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు

  • చౌటుప్పల్ లో మొత్తం పోలింగ్ బూత్ ల సంఖ్య 68

  • తర్వాత నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు

  • నారాయణపురం మండలంలో మొత్తం బూత్ లు 54

  • నారాయణ పురం మండలం ఓట్లు కూడా మూడు రౌండ్ల పాటు లెక్కింపు

  • మొత్తం యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్, నారాయణ పురం కలిపి 122 పోలింగ్ బూత్ లు

  • నారాయణ పురం తర్వాత మునుగోడు ఓట్ల లెక్కింపు 

  • మునుగోడులో మొత్తం 44 బూత్ లు

  • మునుగోడు మండలంలో రెండు రౌండ్ల పాటు సాగనున్న లెక్కింపు

  • మునుగోడు తర్వాత చండూరు మండలం లెక్కింపు

  • చండూరులో మొత్తం బూత్ లు 40

  • ఇక్కడ కూడా రెండు రౌండ్ల పాటు లెక్కింపు

  • మర్రిగూడ (33), నాంపల్లి(43), గట్టుపల్(16) మండలాల్లో మొత్తం బూత్ లు సంఖ్య 92

  • ఈ మూడు మండలాల్లో కలిపి ఐదు‌ రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు

08:17 AM (IST)  •  06 Nov 2022

Munugode Election Counting: ఓట్ల లెక్కింపులో 250 మంది సిబ్బంది

మునుగోడు ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కౌంటింగ్ కోసం 100 మందిని కేటాయించగా, దాని సంబంధిత పనుల కోసం 150 మందిని కేటాయించారు.