Mulugu News : కొడుకును స్కూలుకు పంపిన తల్లిదండ్రులకు మధ్యాహ్నంలోపే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిండనే చేదువార్త కడుపుకోత మిగిల్చింది. స్కూల్ టీచర్ల నిర్లక్ష్యంతో పసిప్రాణం పోయింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్టించుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి స్కూల్ నుంచి బయటకు వెళ్లి సమీపంలోని నీటిగుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో శనివారం జరిగింది. బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్వాయి గ్రామానికి చెందిన అల్లం స్వాతి, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసే ఆ దంపతుల చిన్న కుమారుడు రిషిత్(7) చల్వాయిలోని హాస్టల్ గడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో 2వతరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన రిషిత్ పాఠశాలకు వెళ్లి బుక్స్ పెట్టి మరో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు.
టాయిలెట్స్ సదుపాయంలేకే
పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నా కూడా అవి నిరుపయోగంగానే ఉన్నాయి. చిన్నారులు ప్రతీరోజు టాయిలెట్స్ కు స్కూల్ నుంచి బయటకే వెళ్తారు. ఈ క్రమంలో బహిర్భూమికి స్నేహితునితో కలిసి వెళ్లిన రిషిత్ నీళ్లలో పడిపోయి ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు మరణించిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో స్కూల్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తమ కొడుకు చావుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవిందరావుపేట ఎంఈవో దివాకర్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని చెప్పడంతో అంతిమయాత్రకు తీసుకెళ్లారు.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం?
చల్వాయి ప్రాథమిక పాఠశాలలో బాలుడి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 23 ది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా పట్టింపులేకుండా వ్యవహరించారన్నారు. స్కూల్ లో ఉన్న టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయని, విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిందేనని ఆరోపిస్తున్నారు. స్కూల్ నిర్వహణ సక్రమంగా లేకనే బాలుడి మృతిచెందాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!
వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడు కొట్టడంతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పూడురు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు సాత్విక్ ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. టీచర్ దాడిలో సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తనను స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే సాత్విక్ ప్రాణాలు విడిచాడు. కేశవరెడ్డి స్కూల్ టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల తన కొడుకు సాత్విక్ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు చెన్గోమల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సాత్విక్ కు బెడ్ పై నుండి కింద పడటం వల్లే గాయాలు అయ్యాయని పాఠశాల యాజమాన్యం అంటోంది. విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాత్విక్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో విచారణ చేపట్టారు.