MP Uttam Kumar Reddy: కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసి సాగాల్సిన తరుణంలో అంతర్గత కుమ్ములాటలు బయటకు పొక్కాయి. ఒకవైపు ఇతర పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఒకరి తప్పులను ఒకరు ఎత్తిచూపుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం వారిలో వారే విమర్శలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ నిరసనల పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ తరుణంలోనే నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.


బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే కాంగ్రెస్ రానున్న ఎన్నికల కోసం కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో హాథ్ సే జోడో యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణులను తిరిగి యాక్టివేట్ చేసే పనిలో పడింది కాంగ్రెస్ నాయకత్వం. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారాన్ని కూడా సమర్థంగా వాడుకుంది. క్వశ్చన్ పేపర్ల లీకులతో నిరుద్యోగుల సమస్యలు మరోసారి ఫోకస్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నిరుద్యోగ నిరసన పేరుతో ఈ నెల 21వ తేదీన నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం నిర్వహించాని నిర్ణయించింది.


నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాల్సి ఉండగా.. నిరసన కార్యక్రమంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం గురించి తనకేమీ తెలియదని ఉత్తమ్ అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనతో చర్చించకుడానే నిరసన కార్యక్రమ నిర్ణయం తీసుకున్నారని, అంతే కాకుండా మాజీ పీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ అయిన తనకు అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తాను ఎవరితోనూ చెప్పలేదని, తనతో చర్చించి నిరసన కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన పార్టీ తన నియోజకవర్గంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో నిర్వహిస్తుందన్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 


టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిన్న స్థాయి ఉద్యోగులను అరెస్టు చేస్తూ అసలు వ్యక్తుల జోలికి వెళ్లకుండా సిట్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్ లో నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ పిలుపునిచ్చారు. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్ లోని సరూర్ నగర్ గ్రౌండ్ లో నిరుద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతారని వెల్లడించారు.