Montha Cyclone Effect In Telangana : ఆంధ్రప్రదేశ్‌ను రెండు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను ఇప్పుడు తెలంగాణలో ప్రతాపం చూపిస్తోంది. తీరం దాటిన తర్వాత కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గడ్‌, ఒడిశా వైపుగా వెళ్తుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా తుపాను బుధవారం ఉదయం తన దిశను మార్చుకుంది. ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ సరిహద్దులను దాటుకొని ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. 

Continues below advertisement

మొంథాతుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కుమ్మేశాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వాన పడుతూనే ఉంది. ఈ అనూహ్య తుపానుధాటికి హనుమకొండ, వరంగల్ , సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో విపత్తు పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం సాయంత్రానికి తీవ్ర తుపాను వాయుగుండంగా మారినప్పటికీ ప్రభావం మాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

వరంగల్‌లో కుండపోత- రికార్డు స్థాయిలో వర్షపాతం 

మొంథా తుపాను తీవ్రతను అంచనా వేయడానికి హనుమకొండలో నమోదైన వర్షపాతమే నిదర్శనం. ఊళ్లను ముంచేస్తుందా అన్నట్టుగా అత్యంత భారీ వర్షఆలు ఉమ్మడి వరంగల్ జిల్లాను వణికించాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాోని పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 CM వర్షపాతం నమోదు అయింది. నెక్కొండ, సంగెం, ఖిలా వరంగ్, వర్దన్నపేట, రాయపర్తి, వరంగల్, గీసుకొండ, చెన్నారావుపేట మండలాల్లో కూడా వర్షాలు కుమ్మేశాయి. 

Continues below advertisement

గ్రేటర్‌ వరంగల్ పరిధిలోని ప్రాంతాలన్ని అతలాకుతలమైపోయాయి. హనుమకొండ, వరంగల్, కాజీపేట దాదాపు ౩౦కిపైగా కాలనీలు నీట మునిగాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వరండాలోకి నీళ్లు చేరాయి. హనుమకొండ బస్టాండు నీటమునిగింది. రోడ్లపైకి నీరు చేరడంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ నదిసహా ఇతర వాగులు పొంగడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సూర్యపేట జిల్లా అర్వపల్లిలో కస్తూర్బా పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. దేవరకొండ- కొమ్మెపల్లి ప్రాంతంలో ఉన్న గురుకుల పాఠశాలలో చిక్కుకున్న వారిని కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉప్పునుంతల మండలంలో 20 సీఎం కంటే ఎక్కువ వర్ష పాతం నమోదు అయింది. దిండి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీని కారణంగా లత్తీపూర్ వద్ద శ్రీశైలం- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది నీటి మట్టం 19.20 అడుగులకు చేరింది. కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద వాగులో డీసీఎం కొట్టుకుపోయి డ్రైవర్ గల్లంతయ్యాడు. 

రైలు వ్యవస్థపై ప్రభావం- పలు ట్రైన్స్ క్యాన్సిల్‌

తుపానుప్రభావం రైలు బస్ రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. దక్షిణ మధ్య రైల్వే లు రైళ్లను నిన్న మొన్న రద్దు చేసింది. ఇవాళ కూడా పలు ట్రైన్‌లను క్యాన్సిల్ చేసింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ ట్రాక్‌పైకి వరద నీరు చేరింది. దీంతో రైళ్లను కాసేపు ఆపేశారు. పోలీసులు సకాలంలో చేరుకొని ప్రయాణికులకు ఆహారం , మంచినీళ్లు అందించారు. వందేభారత్‌ను ఖమ్మం స్టేషన్‌లో కాసేపు నిలిపేశారు. తర్వాత వెనక్కి మళ్లించి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ తరలించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మహబూబాాద్‌లో ఐదు గంటలపాటు నిలిపేశారు. తెలంగాణ ఆర్టీసీ కూడా మొత్తం 135 బస్ సర్వీసులను రద్దు చేసింది. ఇందులో 72 అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఉన్నాయి.  

తుపాను బలహీనపడినా చాలా జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్‌కు అవకాశం ఉంది. అందుకే ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.