మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2, 3వ వార్డులలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు ప్రజల పనుల్లో మంత్రి భాగస్వాములు అయ్యారు. ఒక్కో ఓటరుతో మాట్లాడుతూ, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ  మంత్రి ప్రచారం నిర్వహించారు. 


పలు చోట్ల ప్రజలతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ‘‘ఓటర్లు మాత్రం కేసీఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు. కొందరు మధ్యల వచ్చి కెళ్లగిస్తాండ్రు. పైసల ఆశ పెడ్తాండ్రు. నమ్మెటోల్లు ఎవరూ లేరు’’ అని మునుగోడులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాశం శివారెడ్డి అనే వ్యక్తి ఇలా సంభాషించారు.


‘‘మాకు కరెంటు బాధ లేకుండా అయింది. పింఛను బాధ లేకుండా అయింది. పంచాయతీలు లేకుండా ఇంటి ముందటికే నీళ్ళు వస్తానయి. మాకు ఏ బాధా లేదు. ఓటర్లు మాత్రం కేసీఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు. రేపు ఓట్లు మాత్రం మెజారిటీగా ఫుల్లు పడతయి. కొందరు మధ్యల వచ్చి కెళ్లగిస్తాండ్రు. పైసల ఆశ పెడ్తాండ్రు. నమ్మెటోల్లు ఎవరూ లేరు. అంటూ మునుగోడు ఉప ఎన్నికలో తనకు బాధ్యతలు అప్పగించిన చండూరు 2, 3 వార్డులలో ప్రచారం లో నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాశం శివారెడ్డి అన్నారు. ఇంకా ఆయన మంత్రి ఎర్రబెల్లి తో సంభాషణ చేస్తూ.... ‘‘కేసీఆర్ ఏం తక్కువ చేసిండు. ఒకరిద్దరు పిచ్చి పిచ్చిగా ఒంకర టింకర గా మాట్లాడతాండ్రు. జనం ఆలోచన చేసుకోవాలె. తప్పుడు తోవన పోతే వాళ్ళకే ఇబ్బంది అయితది. కేసీఆర్ తప్పేం చేసిండు? తక్కువ పని చేస్తే బాధ పడాలే. మంచి పనులు చేస్తుండు కదా!’’ అంటూ... మంత్రితోనే అనడంతో ఆయన ఆశ్చర్యపోయారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి సహా అంతా జై తెలంగాణ! జై కెసీఆర్!! అంటూ నినాదాలు ఇస్తూ.. అక్కడి నుంచి బయలుదేరారు.






విపరీతంగా డబ్బు చెలామణి


ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక కారణంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సాగుతూండటంతో పెద్ద ఎత్తున పార్టీలు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ఓటర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పట్టుబడుతున్న డబ్బు అంతా మునుగోడుకే వెళ్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతోనే సోదాలు చేసి నగదును పట్టుకుంటున్నారని చెబుతున్నారు.


హైదరాబాద్‌లో ప్రతీ రోజూ రూ. కోట్లలో నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారో పోలీసులే కొత్తగా సోదాలు ప్రారంభించారో కానీ పెద్ద ఎత్తున నగదు హవాలా రూపంలో తరలి పోతోంది. ఇందులో దొరుకుతోంది మాత్రమే తెలుస్తోంది.. ఎంతెంత తరలి పోతోందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. మంగళవారం గాంధీనగర్‌లో పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా తరలిస్తున్న రూ. 3.5కోట్ల హవాలా మనీ దొరికింది.