మునుగోడు ఓటర్ల జాబితా విషయంలో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. నియోజకవర్గంలో పూర్తి ఓటర్ల జాబితాకు సంబంధించి రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇటీవల కొత్తగా వేల సంఖ్యలో నమోదైన కొత్త ఓటర్లకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ చేయించాలని హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్ పై నేడు విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం రేపటికి విచారణ వాయిదా వేసింది.


మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని కోర్టును బీజేపీ కోరింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో అభ్యర్థించింది. గత కొద్ది నెలల  సమయంలోనే మునుగోడులో 25 వేల వరకూ కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయని వివరించింది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపణ చేసింది. ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని, ఆ లిస్ట్‌ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీజేపీ కోరింది.


ఏడు నెలల్లో 1,500 దరఖాస్తులే..


కొత్తగా ఓట్ల కోసం అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య ఈ 2 నెలల్లోనే 25 వేలు దాటిందని బీజేపీ చెబుతోంది. బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు 7 నెలల కాలంలో 1,500 మంది కూడా కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఈ మధ్య కాలంలోనే పెద్ద మొత్తంలో ఏకంగా 24,781 దరఖాస్తులు వచ్చాయని బీజేపీ వాదిస్తోంది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. 


అయితే, బీజేపీ దాఖలు చేసిన ఈ లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనా రెడ్డి రెండు రోజుల క్రితం కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనుందని రచనా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, ఈ నెల 13న విచారణ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తాజాగా విచారణ చేసిన ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.