పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుదామని ఆ కుటుంబం అనుకుంది. పాఠశాలలో తోటి విద్యార్ధులకు చాక్లెట్లు పంచి తన ఆనందాన్ని పంచుకుంది చిన్నారి. తాత రావడంతో తిరిగి ఇంటి దగ్గర జరిగే వేడుకలకు బైకుపై పయనమైంది. మార్గం మద్యలో చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు చిన్నారి ప్రాణాలు తీసుకుంది. పుట్టిన రోజే చిన్నారిపై చెట్టు కొమ్మ పడటంతో మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది.  
సత్తుపల్లి పట్టణానికి చెందిన కాళ్లకూరి అశోక్, జ్యోత్స దంపతులకు కుమార్తె 11 ఏళ్ల లిఖిత సంతోషిని ఉంది. అశోక్‌ ఆరేళ్ల కిందటఅశోక్‌ మృత్యువాత పడటంతో జ్యోత్స్న తన కుమార్తెను సత్తుపల్లిలోనే తల్లిదండ్రుల వద్ద ఉంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం లిఖిత సంతోషిని బర్త్‌డే కావడంతో ఇంట్లో వేడుకలు చేసుకునేందుకు సిద్దమయ్యారు. తాత పూర్ణచందర్‌రావు ద్విచక్రవాహనంపై పిన్ని కూతురు దేవికాసాయితో కలిసి గంగారంలోని తాను చదివే పాఠశాలకు వెళ్లి తన స్నేహితులకు చాక్లెట్లు పంచింది.


విరిగి పడిన చెట్టుకొమ్మ.. అంతులేని విషాదం 
అనంతరం తిరిగి ఇంటి దగ్గర తన పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు ద్విచక్ర వాహనంపై పయనమయ్యారు. వీరు ముగ్గురు కలిసి వస్తుండగా తాళ్లమడ దగ్గర రహదారిపై ఉన్న చెట్టుకొమ్మ విరిగి ద్విచక్రవాహనంపై పడింది. ఈ సంఘటనలో లిఖితకు తీవ్ర గాయాలు కావడంతో ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మద్యలో మృత్యువాతపడింది. పుట్టిన రోజు నాడే చిన్నారిని చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పుట్టిన రోజు వేడుకను అంతా సంబంరంగా జరుపుకుందామని బావించిన వారికి చిన్నారి మృతి చెందడం ఈ ప్రాంతంలో విషాదకరంగా మారింది.


పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన చిన్నారిని చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు కబళించడం ఇప్పుడు సత్తుపల్లి ప్రాంతాన్ని విషాదంగా మార్చింది. ఎండిపోయిన చెట్లను తొలగించాల్సిన అధికారులు వాటిని తొలగించకపోవడం వల్ల ఒక్క చిన్నారి మృత్యువాతపడాల్సి వచ్చింది. మరోవైపు రహదారులపై ఎండిన కొమ్మలను తొలగించాలని గత అనేక మార్లు అధికారులు విన్నవించినప్పటికీ వాటిని తొలగించలేదని, ఆ కారణంగానే చెట్టుకొమ్మ విరిగి ద్విచక్ర వాహనంపై పడటంతో చిన్నారి లిఖిత మృతి చెందిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు..
రహదారులపై ఎండిపోయిన చెట్టుకొమ్మలు విరిగి పడటంతో ఇటీవల కూసుమంచి ప్రాంతంలో ఒక్కరు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పల్లె ప్రగతి సమీక్షల్లో సత్తుపల్లి ప్రాంతానికి వచ్చిన పి.వి.గౌతమ్‌కు రహదారి మద్యలో ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కలెక్టర్‌కు పిర్యాదు వెళ్లిన నేపథ్యంలో కొన్ని చోట్ల చెట్లను తొలగించిన అధికారులు మరికొన్ని చోట్ల మాత్రం వాటిని వదిలేశారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృత్యువాతపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము పిర్యాదు చేసినప్పుడు ఎండిపోయిన చెట్లను తొలగిస్తే ఇలాంటి సంఘటన జరిగేది కాదని, ఇందుకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం ఉందని ముందే విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించి ఎండిపోయిన చెట్లను తొలగించకపోవడంతో ఒక్క చిన్నారి మృత్యువాత పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.