Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌ శుక్రవారం వేశారు. నేటితో మునుగోడు నామినేషన్ పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువు ఉంది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. 50కి పైగా నామినేషన్లు చివరి రోజు శుక్రవారం దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి చండూరు తహశీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్ నేతల సమక్షంలో ఆమె నానినేషన్ దాఖలు చేశారు. 






ప్రజలు కాంట్రాక్టర్లు కాదు అమ్ముడుపోవడానికి


నామినేషన్ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల  అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ చూస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి కాంట్రాక్టర్లు కాదని స్పష్టం చేశారు. దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయన్నారు. దిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించగలరా అని రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.  బీజేపీ, టీఆర్ఎస్ ముఠాలు, మూటలతో మునుగోడులో ల్యాండ్ అయ్యాయని ఆరోపించారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొడంగల్‌ను దత్తత తీసకుంటున్నానని చెప్పిన కేటీఆర్‌, ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు చేశారు.  మునుగోడు ప్రజలను కొడంగల్‌ తీసుకెళ్లి చూపిస్తానన్నారు. రోడ్లపై గుంతలు పడితే తట్టెడు మట్టివేసే దిక్కులేదన్నారు. రేపో మాపో మునుగోడుకు సీఎం కేసీఆర్‌ వచ్చి కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటా మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.  


రాహుల్ జోడో యాత్రపై 
 
ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ లను నియమించామన్నారు. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందన్నారు.  ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. 


Also Read : PhonePe On ContractPe : మునుగోడు కాంట్రాక్ట్ పే పోస్టర్లపై ఫోన్ పే అభ్యంతరం, లోగో వాడినందుకు చట్టపరమైన చర్యలు!