Kavitha Hunger Strike: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూ బాధితుల సమస్య ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇప్పుడు వారి కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌ ఈ చారిత్రాత్మక పోరాటానికి వేదికైంది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చున్నారు. 

Continues below advertisement

హైడ్రామా మధ్య సాగిన ఆందోళన! రోడ్డుపై బైఠాయింపు నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు...

ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం బాధితులతో కలిసి ఆమె ప్రధాన రహదారిపైనే బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి తరలించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే చీకటి పడటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. స్టేషన్‌ నుంచి విడుదలైన వెంటనే కవిత వెనక్కి తగ్గకుండా, నేరుగా అంబేడ్కర్‌ భవన్‌కు చేరుకునే తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు. 

Continues below advertisement

అంబేడ్కర్‌ భవన్‌లో దీక్షా పర్వం- కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు 

ప్రస్తుతం అంబేడ్కర్‌  భవన్‌లో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ పోరాటం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ఇది భూమిని నమ్ముకున్న పేదవాడి హక్కుల పోరాటమని ఆమె అభివర్ణించారు. భూదాన్ భూములు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వెలుగుమట్ల ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన వారికి గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. 

వెలుగుమట్ల బాధితుల వేదనకు కారణమేంటి?

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పేదలకు కేటాయించిన భూములను ఇతరులు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో వారికి పట్టాలు దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడును వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ బాధితులకు కవిత మద్దతు తెలపడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.